మార్కెట్లో ‘ఉద్రిక్తతలు’..!

18 Jun, 2020 06:25 IST|Sakshi

తీవ్రహెచ్చుతగ్గుల్లో సెన్సెక్స్, నిఫ్టీలు 

సెన్సెక్స్‌ 97 పాయింట్లు డౌన్‌  

33 పాయింట్ల నష్టంతో 9,881కు నిఫ్టీ

రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌ చివరకు నష్టాల్లో ముగిసింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింతగా ముదరడం, కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు జరగడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ మళ్లీ మొదలవడం...ప్రతికూల ప్రభావం చూపాయి. రోజంతా 601 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 97 పాయింట్ల నష్టంతో 33,506 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33 పాయింట్లు పతనమై 9,881 పాయింట్ల వద్దకు చేరింది.
 
సోమవారం రాత్రి చైనా సైనికులతో జరిగిన బాహాబాహీలో 20 మంది భారత సైనికులు మరణించారు. 35 మంది  చైనా సైనికులు మరణించి ఉంటారని సమాచారం. ఇరు దేశాల మధ్య గత 45 ఏళ్లలో ఇదే అత్యంత తీవ్రమైన సరిహద్దు సంఘర్షణ. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఇరు దేశాల మధ్య సంబంధాలు ఈ తాజా సంఘటనతో మరింత అ«ధ్వానం అవుతాయని ఆందోళన నెలకొన్నది. మరోవైపు మన దగ్గర కొత్త  కరోనా కేసులు రోజుకు పదివేల చొప్పున నమోదవుతున్నాయి.   ఇటీవల వరకూ మన మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ వచ్చిన విదేశీ ఇన్వెస్టర్లు గత మూడు రోజులుగా నికర అమ్మకందారులుగా నిలిచారు. ఈ అంశాలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.  

601 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నా, సరిహద్దు వివాదం నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే మొదలయ్యాయి. ఈ సూచీలు నాలుగు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చాయంటే ఒడిదుడుకులు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో 272 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ మరో దశలో 329 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 601 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. జపాన్‌ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి.  

► కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్‌ 3 శాతం నష్టంతో రూ.1,241 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
► మారుతీ సుజుకీ షేర్‌ 4 శాతం లాభంతో రూ.5,726 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు