ఆదుకున్న ఐటీ

11 Jun, 2014 00:55 IST|Sakshi
ఆదుకున్న ఐటీ

 రోజంతా ఒడిదుడుకులు

  •  చివరికి స్వల్ప లాభాలు
  •  ఒక దశలో 25,711కు సెన్సెక్స్
  •  25,584 వద్ద ముగింపు

తొలుత లాభాలతో మొదలైన మార్కెట్లు ఆపై అధిక భాగం నష్టాలకు లోనయ్యాయి. చివర్లో తిరిగి కోలుకుని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఉదయం సెషన్‌లో 25,711 పాయింట్ల వద్ద కొత్త చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ మిడ్ సెషన్‌లో అమ్మకాలు పెరగడంతో కనిష్టంగా 25,347కు చేరింది. ఈ స్థాయి నుంచి 236 పాయింట్లు కోలుకుంది. వెరసి 3 పాయింట్ల లాభంతో 25,584 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా ెహ చ్చుతగ్గులను చవిచూసి చివరికి 2 పాయింట్లు పెరిగి 7,656 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, మార్కెట్లను 2% స్థాయిలో పుంజుకున్న ఐటీ, హెల్త్‌కేర్ రంగాలు ఆదుకున్నాయి. మరోవైపు రియల్టీ ఇండెక్స్ 3% పతనమైంది.
 
ఎఫ్‌ఐఐల పెట్టుబడులు

సోమవారం రూ. 537 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా మరో రూ. 682 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 1,215 కోట్ల అమ్మకాలను చేపట్టాయి. సెన్సెక్స్‌లో ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ 3-2% మధ్య పుంజుకోగా, హెల్త్‌కేర్ షేర్లు సిప్లా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 3-1% చొప్పున లాభపడ్డాయి.
 
అయితే మరోవైపు భెల్, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, హీరోమోటో, సెసాస్టెరిలైట్ 2.5% స్థాయిలో డీలాపడగా, యాక్సిస్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ 1.5% చొప్పున నష్టపోయాయి. ఇక రియల్టీ షేర్లు శోభా, ఇండియాబుల్స్, ఒబెరాయ్, డీఎల్‌ఎఫ్, యూనిటెక్ 6-3% మధ్య నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,834 లాభపడగా, 1,272 నష్టపోయాయి.

మరిన్ని వార్తలు