స్వల్ప నష్టాలు

8 Mar, 2017 01:58 IST|Sakshi
స్వల్ప నష్టాలు

ఎగ్జిల్‌ పోల్‌కు ముందు అప్రమత్తత
49 పాయింట్ల నష్టంతో 29,000కు సెన్సెక్స్‌
17 పాయింట్ల నష్టంతో 8,947కు నిఫ్టీ


ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలకు ముందు అప్రమత్తత నెలకొనడంతో స్టాక్‌ మార్కెట్‌  మంగళవారం నష్టపోయింది. లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సెన్సెక్స్‌  49 పాయింట్ల నష్టంతో 29,000 పాయింట్లకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 8,947 పాయింట్లకు తగ్గాయి.  లోహ, వాహన, ఫార్మా, రియల్టీ, బ్యాంక్‌ షేర్లు క్షీణించాయి.

ఒడిదుడుకుల్లో సూచీలు....
రేపు(గురువారం) ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు రానున్నందున ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. వచ్చే వారం ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు అవకాశాలు బలం పుంజుకోవడం, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం ప్రతికూల ప్రభావం చూపాయి. స్టాక్‌ సూచీలు రెండేళ్ల గరిష్ట స్థాయిలను తాకడంతో  లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపధ్యంలో లాభాల స్వీకరణ జరిగిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌(రీసెర్చ్‌) వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఈ వారంలోనే యూరోప్‌ కేంద్ర బ్యాంక్‌ ద్రవ్య విధానాన్ని వెలువరించనున్నదని, ఈ కారణంగా స్టాక్‌ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయని వివరించారు. సెన్సెక్స్‌ లాభాల్లోనే ప్రారంభమైనప్పటికీ, అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారిపోయింది. సోమవారం నాటి ముగింపుతో పోల్చితే సెన్సెక్స్‌  ఒక దశలో 50 పాయింట్లు లాభపడగా, మరో దశలో 91 పాయింట్లు నష్టపోయింది. చివరకు 49 పాయింట్లు క్షీణించింది.

లోహ షేర్లకు నష్టాలు..
గత ఏడాది చైనా జీడీపీ 6.7 శాతంగా ఉంది. ఈ ఏడాది జీడీపీ లక్ష్యాన్ని చైనా 6.5 శాతంగా నిర్దేశించికుందని వార్తలు వచ్చాయి. దీంతో చైనా వృద్ధిపై ఆందోళనతో లోహ షేర్లు నష్టపోయాయి. ప్రపంచంలో లోహాలను అధికంగా చైనాయే వినియోగిస్తుంది కాబట్టి లోహ షేర్లు కుదేలయ్యాయి. హిందాల్కో, హిందుస్తాన్‌ జికంŠ, సెయిల్, వేదాంత, టాటా స్టీల్‌ నాల్కో, 2నుంచి 4 శాతం రేంజ్‌లో పతనమయ్యాయి.

మరిన్ని వార్తలు