బడ్జెట్‌.. ముంచెన్‌!

9 Jul, 2019 05:28 IST|Sakshi

పన్ను పోటుతో భారీ పతనం

సంపన్నులపై సర్‌చార్జీ భారం

దీంతో విదేశీ ఇన్వెస్టర్లకు మరింత పన్ను సెగ 

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ గణాంకాలు

తగ్గిన ఫెడ్‌ రేట్ల కోత అంచనాలు 

గ్లోబల్‌ ఈక్విటీలకు తగ్గిన మోర్గాన్‌ స్టాన్లీ పెట్టుబడులు 

నష్టాల్లో ప్రపంచ మార్కెట్లు 

జూన్‌ క్వార్టర్‌ ఫలితాలపై ఆందోళన 

38,800 పాయింట్ల దిగువకు సెన్సెక్స్‌

793 పాయింట్లు పతనమై 38,721 వద్ద ముగింపు 

11,600 పాయింట్ల కిందకు నిఫ్టీ 

253 పాయింట్ల నష్టంతో 11,559 వద్ద ముగింపు 

ఈ ఏడాది ఇదే అత్యధిక నష్టం...

విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను పోటు మరింతగా పెరుగుతుందనే ఆందోళనతో సోమవారం మన స్టాక్‌ మార్కెట్‌  భారీగా పడిపోయింది. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,800 పాయింట్ల దిగువకు, నిఫ్టీ, 11,600 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఇంట్రాడేలో 907 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 793 పాయింట్ల నష్టంతో 38,721 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇక ఇంట్రాడేలో 288 పాయింట్ల మేర క్షీణించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో 11,559 పాయింట్ల వద్దకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఈ ఏడాది బాగా నష్టపోయింది ఈ రోజే. సెన్సెక్స్, నిఫ్టీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, 2016, ఏప్రిల్‌ తర్వాత ఈ సూచీలు అత్యధికంగా నష్టపోవడం ఇదే మొదటిసారి. ఆర్థిక, వాహన, చమురు షేర్లు బాగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి.

అంచనాలు తల్లకిందులు...
మందగమనంలో ఉన్న వినియోగ రంగానికి జోష్‌నివ్వడానికి కేంద్రం బడ్జెట్‌లో తాయిలాలు ఇవ్వగలదని అందరూ అంచనా వేశారని శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఎనలిస్ట్‌ సునీల్‌ శర్మ పేర్కొన్నారు. ఈ అంచనాలన్నీ తల్లకిందులు కావడం, మరోవైపు రానున్న ఆర్థిక ఫలితాలు మరింత అధ్వానంగా ఉండబోతున్నాయన్న ఆందోళనతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతిన్నదని వివరించారు. సెన్సెక్స్‌ భారీ నష్టాల్లో ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ ఎలాంటి ఊరటలేకపోగా, ఈ నష్టాలు అంతకంతకూ పెరిగాయి.  

మరిన్ని విశేషాలు..
► ఇటీవల ప్రతిరోజూ ఆల్‌టైమ్‌ హైలను తాకుతున్న బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్‌ 8 శాతం నష్టంతో రూ.3,415 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  

► అమ్మకాలు తగ్గుతుండటంతో వాహన కంపెనీలు ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయన్న వార్తలు వాహన షేర్లను పడగొట్టాయి. హీరో మోటోకార్ప్‌ 5.3 శాతం,  మారుతీ సుజుకీ 5.2 శాతం, టాటా మోటార్స్‌ 3.4 శాతం, బజాజ్‌ ఆటోలు 2 శాతం చొప్పున నష్టపోయాయి.  

► ఇండెక్స్‌ హెవీ వెయిట్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఓఎన్‌జీసీ 5.4 శాతం, ఎల్‌ అండ్‌ టీ 4.3 శాతం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 0.85 శాతం చొప్పున కుదేలయ్యాయి.  
► పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్‌ భారీగా పతనమైంది. భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ లిమిటెడ్‌కు సంబంధించిన ఖాతాలో రూ.3,800 కోట్ల మోసం జరిగిందన్న విషయం వెలుగులోకి రావడంతో బీఎస్‌ఈలో పీఎన్‌బీ షేర్‌ 11 శాతం నష్టంతో రూ.72.80 వద్ద ముగిసింది.  

► ఎల్‌ అండ్‌ టీ కంపెనీ ఇటీవలనే బలవంతంగా చేజిక్కించుకున్న మైండ్‌ట్రీ షేర్‌ 10 శాతం నష్టంతో రూ.774 వద్ద ముగిసింది. మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు కృష్ణకుమార్‌ నటరాజన్, ఎన్‌ఎస్‌. పార్థసార«థి, రోస్టో రావణన్‌లు తమ తమ డైరెక్టర్ల పదవులకు,  కంపెనీ పదవులకు రాజీనామా చేయడం దీనికి కారణం.

► దాదాపు 300కు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, టీవీఎస్‌ మోటార్‌; హీరో మోటోకార్ప్, ఈరోస్‌ మీడియా, ఎస్కార్ట్స్, సన్‌ టీవీ, కాక్స్‌ అండ్‌ కింగ్స్, గోవా కార్బన్, గ్రాఫైట్‌ ఇండియా తదితర షేర్లు ఈ పతన జాబితాలో ఉన్నాయి.  

► ఎల్‌ అండ్‌ టీ రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ఎల్‌ అండ్‌ టీ షేర్‌ 4% నష్టంతో రూ.1,490 వద్ద ముగిసింది.  

ఎందుకు పడిందంటే...
ఎఫ్‌పీఐలపై పన్ను 
సంపన్న వర్గాలపై మరింత పన్ను విధించాలన్న ప్రతిపాదన.. భారత్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న 2,000కు పైగా విదేశీ ఫండ్స్‌పై తీవ్రంగానే ప్రభావం చూపగలదని నిపుణులంటున్నారు. ట్రస్ట్‌ల మార్గంలో భారత్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న ఎఫ్‌పీఐలపై తాజా సర్‌చార్జీ భారం మరింతగా పెరుగుతుందని, ఫలితంగా పన్ను పరంగా భారత్‌కు ఉన్న ఆకర్షణ తొలగుతుందని, విదేశీ పెట్టుబడులు నీరసిస్తాయని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తాజా  ప్రతిపాదన కారణంగా విదేశీ ఇన్వెస్టర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ) భారం మరింతగా పెరుగుతుంది. ఈ పన్ను విషయమై త్వరలోనే వివరణ ఇస్తామని సీబీడీటీ చైర్మన్‌ పేర్కొనగా, ఇక ఎలాంటి వివరణ అవసరం లేదని, అంతా   స్పష్టంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెగేసి చెప్పారు. దీంతో అమ్మకాలు వెల్లువెత్తాయి.  

బడ్జెట్‌ ప్రతిపాదనలు...
లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రజలకు కేటాయించే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. ఫలితంగా స్టాక్‌ మార్కెట్లో షేర్ల సప్లై పెరిగి లిక్విడిటీ ఆవిరైపోతుంది. ఐటీ, పీఎస్‌యూ షేర్లపై ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక ఎమ్‌ఎన్‌సీలు మన మార్కెట్‌ నుంచి డీలిస్ట్‌ కావడానికి ప్రయత్నాలు చేస్తాయి.  ఇక సంపన్నులపై అధిక పన్నులు విధించడం, షేర్ల బైబ్యాక్‌పై 20 శాతం పన్ను తదితర ప్రతిపాదనలు  కూడా మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావమే చూపుతున్నాయి.  

ప్రపంచ మార్కెట్ల పతనం...
అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల కోతకు సిద్ధమవుతోంది. అయితే గత శుక్రవారం వెలువడిన ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించాయి. ఆర్థిక వ్యవస్థ బానే ఉందన్న సంకేతాలు ఈ గణాంకాలు ఇవ్వడంతో ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లకోత విషయంలో పునరాలోచించే అవకాశాలున్నాయన్న అంచనాలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ, మోర్గాన్‌ స్టాన్లీ ప్రపంచ దేశాల స్టాక్‌ మార్కెట్లను డౌన్‌గ్రేడ్‌ చేయడమే కాకుండా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో తన పెట్టుబడులను తగ్గించుకోవాలని(ఇది దాదాపు ఐదేళ్ల కనిష్ట స్థాయి) నిర్ణయించుకోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఈ కారణాలన్నింటి వల్ల  ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. చైనా షాంఘై సూచీ 2.5 శాతం, హాంగ్‌సెంగ్‌ సూచీ 1.5 శాతం, జపాన్‌ నికాయ్‌ సూచీ 1 శాతం, దక్షిణ కొరియా కోస్పి సూచీ 2.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇక యూరప్‌సూచీలు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి.  

జూన్‌ క్వార్టర్‌ ఫలితాలు.. ఎలా ఉంటాయో ?  
వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉన్న నేపథ్యంలో నేటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెలువడనున్నాయి. బ్యాంక్‌లు మినహా ఇతర రంగాల కంపెనీల ఆర్థిక ఫలితాల్లో పెద్దగా మెరుపులు ఉండకపోవచ్చని, అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న ఆందోళన నెలకొన్నది.

2 రోజులు..రూ. 5 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా సోమవారం ఇన్వెస్టర్ల సంపద రూ.3.39 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాప్‌ రూ.3,39,193 కోట్లు ఆవిరై రూ.1,47,96,303 కోట్లకు పడిపోయింది. బడ్జెట్‌ రోజు సంపద నష్టాన్ని కూడా కలుపుకుంటే మొత్తం రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.5,61,773 కోట్లు హరించుకుపోయింది.

ఎదురీదిన యస్‌ బ్యాంక్‌
అన్ని షేర్లు క్షీణించినా, యస్‌ బ్యాంక్‌ మాత్రం ఎదురీదింది. ఆరంభంలోనే ఐదేళ్ల కనిష్ట స్థాయి, రూ.85.70కు పడిపోయిన ఈ షేర్‌ తర్వాత పుంజుకొని 5.5 శాతం లాభంతో రూ.93 వద్ద ముగిసింది. బ్యాంక్‌ ఆర్థిక స్థితిగతులు భేషుగ్గా ఉన్నాయని యాజమాన్యం స్పష్టతనివ్వడంతో పాటు ఉన్నత స్థాయిల్లోని నిర్వహణ పదవులను భర్తీ చేయడం కూడా కలిసి వచ్చింది. సెన్సెక్స్‌లో ఈ షేర్‌తో పాటు టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మాత్రమే లాభపడ్డాయి. మొత్తం మీద 31 సెన్సెక్స్‌ షేర్లలో 28 షేర్లు నష్టపోయాయి.

మరిన్ని వార్తలు