ఆరు రోజుల లాభాలకు బ్రేక్‌

5 Jun, 2020 06:45 IST|Sakshi

బ్యాంక్‌ షేర్లలో లాభాల స్వీకరణ 

సెన్సెక్స్‌ 129 పాయింట్లు డౌన్‌ 

32 పాయింట్లు తగ్గిన నిఫ్టీ

ఆరు రోజుల ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణ కారణంగా గురువారం స్టాక్‌ మార్కెట్‌ పతనమైంది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, మన దగ్గర కరోనా కేసులు పెరుగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం... ప్రతికూల ప్రభావం చూపించాయి. అయితే రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్‌ తదితర బ్లూ చిప్‌ షేర్లు పెరగడంతో నష్టాలు తగ్గాయి. సెన్సెక్స్‌ కీలకమైన 34,000 పాయింట్లపైన నిలదొక్కుకోలేకపోయినా, నిఫ్టీ మాత్రం 10,000 పాయింట్లపైననే ముగిసింది.

రోజంతా 599 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 129 పాయింట్ల పతనమై 33,981 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 10,029 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు కార ణంగా సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీని రద్దు చేయాలన్న పిటీషన్‌పై ఆర్థిక శాఖ వివరణను సుప్రీం కోర్టు కోరింది. దీంతో బ్యాంక్‌ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. లాభాల స్వీకరణ కారణంగా బ్యాంక్, ఆర్థిక రంగ, రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు నష్టపోయాయి. షాంఘై సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు, యూరప్‌ మార్కెట్లు  కూడా నష్టాల్లో ముగిశాయి.  

►  ఏషియన్‌ పెయింట్స్‌ షేర్‌ 5% నష్టంతో రూ.1,633 వద్ద ముగిసింది.  
► రైట్స్‌ ఇష్యూ విజయవంతం కావడంతో రిలయన్స్‌ షేర్‌ 2.4% లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.10 లక్షల కోట్ల మైలురాయిని(10.68 లక్షల కోట్లు) దాటింది.  
► అమెజాన్‌ సంస్థ 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నదన్న వార్తలతో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ 4% లాభంతో రూ. 573వద్ద ముగిసింది.  
► హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో 2 శాతం వాటాకు సమానమైన 4 కోట్ల ఈక్విటీ షేర్లను  ఇంగ్లాండ్‌కు చెందిన స్డాండర్డ్‌ లైఫ్‌ రూ.1,985 కోట్లకు బహిరంగ మా ర్కెట్‌ లావాదేవీల్లో విక్రయించింది. బీఎస్‌ఈలో ఈ షేరు 3.2% లాభంతో రూ.518 వద్ద ముగిసింది.   

>
మరిన్ని వార్తలు