3 నెలల గరిష్టంలో ముగిసిన నిఫ్టీ

16 Jul, 2015 00:18 IST|Sakshi
3 నెలల గరిష్టంలో ముగిసిన నిఫ్టీ

- 265 ప్లస్‌తో 28,198 వద్దకు సెన్సెక్స్
- 70 పాయింట్ల లాభంతో 8,524కు నిఫ్టీ

కీలక రేట్లను ఆర్‌బీఐ తగ్గిస్తుందన్న అంచనాలు, సానుకూల అంతర్జాతీయ సంకేతాల కారణంగా  బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 28 వేల పాయింట్లను, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,500 పాయింట్లను దాటాయి.  నిఫ్టీ మూడు నెలల గరిష్టస్థాయి వద్ద ముగిసింది.

వాహన, ఐటీ, టెక్నాలజీ షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిం చింది. సెన్సెక్స్ 265 పాయింట్ల లాభంతో 28,198 పాయిం ట్ల వద్ద,  నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 8,524 పాయింట్ల వద్ద ముగిశాయి.    వచ్చే నెలలో జరగనున్న ఆర్‌బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్షలో కీలర రేట్లను ఆర్‌బీఐ తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలు, ఇరాన్ అణు ఒప్పందం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గే అవకాశాలుండడం,  అమెరికా జూన్ రిటైల్ అమ్మకాలు బలహీనంగా ఉండడంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపును జాప్యం చేయోచ్చన్న ఊహాగానాలు,  తాజా బెయిలవుట్ ప్యాకేజీని గ్రీస్ పార్లమెంట్ నేడు ఆమోదించే అవకాశాలుండడం.... ఇవన్నీ  సెంటిమెంట్‌కు బూస్ట్‌నిచ్చాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి.
 
మారుతీ జోరు : మారుతీ సుజుకీ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.4,182ను తాకి చివరకు 2.6 శాతం లాభంతో రూ.4,155 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా పెరిగిన షేర్ ఇదే. ఆరవ వేతన కమీషన్ సిఫారసుల కారణంగా కంపెనీ అమ్మకాలు బాగా పెరిగాయని, ఇప్పుడు ఏడవ వేతన కమీషన్ సిఫారసులు  రానున్నాయని దీంతో ఈ సారి కూడా ఈ కంపెనీ అమ్మకాలు బాగాపెరుగుతాయని క్రెడిట్ సూసీ భావిస్తోంది. ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌లో ఈ షేర్‌ను చేర్చే అవకాశాలున్నాయన్న అంచనాలతో ఈ షేర్‌ను రూ.5,100 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. దీంతో ఈ షేర్ దూసుకుపోయింది. మంగళవారం ఏడాది కనిష్ట స్థాయికి చేరిన టాటా మోటార్స్ రికవరీ అయింది. 2.2 శాతం లాభంతో రూ. 394 వద్ద ముగిసింది.

 
మున్సిపల్ బాండ్ల మార్గదర్శకాలు విడుదల
న్యూఢిల్లీ: మున్సిపల్ బాండ్ల జారీ, స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్, ట్రేడింగ్ తదితర అంశాలకు సంబంధించి సెబీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. ప్రధానంగా రుణాల ఎగవేత లేకుండా ఆర్థికంగా పటిష్టమైన ట్రాక్ రికార్డు ఉన్న మున్సిపాలిటీలే బాండ్లను జారీ చేయగలవు.

మరిన్ని వార్తలు