ముందే వచ్చిన దీపావళి

21 Oct, 2014 00:38 IST|Sakshi
మోదీ విజయాల ర్యాలీ

* సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ
* 26,430 వద్ద ముగింపు
* మోదీ విజయాల ర్యాలీ
* నిఫ్టీ 100 పాయింట్లు ప్లస్

 
డీజిల్‌పై నియంత్రణలు ఎత్తివేయడం, గ్యాస్ ధర పెంపు వంటి సంస్కరణలు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. దీనికితోడు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం సాధించిన విజయం సెంటిమెంట్‌కు ఊపునిచ్చింది. వెరసి రెండు రోజుల ముందే స్టాక్ మార్కెట్లలో లాభాల దీపావళి మెరిసింది.
 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీల ద్వారా బలం పెరగడంతో ఒక్కసారిగా మార్కెట్లలో పరిస్థితులు మెరుగయ్యాయ్. మోదీ అధ్యక్షతన పనిచేస్తున్న ఎన్‌డీఏ ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు తెరలేపుతుందన్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చాయ్. ఇప్పటికే డీజిల్‌ను డీరెగ్యులేట్ చేయడం ఇందుకు సహకరించింది. దీంతో ఉదయం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లుపైగా ఎగసింది. ఆపై 26,518 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 321 పాయింట్ల లాభంతో 26,430 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా సెంచరీ కొట్టి(100 పాయింట్లు ప్లస్) 7,879 వద్ద స్థిరపడింది.
 
మరిన్ని విశేషాలివీ...
* బీఎస్‌ఈలో ఐటీ మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయ్. ప్రధానంగా ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, బ్యాంకింగ్ రంగాలు 2% స్థాయిలో పుంజుకున్నాయి.
* డీజిల్ ధరల డీరెగ్యులేషన్, గ్యాస్ ధర పెంపు నేపథ్యంలో ఆయిల్ షేర్లు హెచ్‌పీసీఎల్ 7.3% ఎగసింది. ఈ బాటలో ఓఎన్‌జీసీ, బీపీసీఎల్, ఐవోసీ, పెట్రోనెట్, గెయిల్ 5.5-2.5% మధ్య పురోగమించాయి.
* పండుగల సీజన్ కారణంగా ఆటో షేర్లు టీవీఎస్, టాటా మోటార్స్, మదర్సన్‌సుమీ, ఐషర్ మోటార్స్, మారుతీ, హీరోమోటో 7-2% మధ్య బలపడ్డాయి.
* బ్యాంకింగ్ షేర్లలో పీఎన్‌బీ, యాక్సిస్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఫెడరల్, యస్ బ్యాంక్ 4-2% మధ్య లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు షేర్లు ఏబీబీ, సీమెన్స్, హావెల్స్‌తోపాటు, బ్లూస్టార్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 4-2.5% మధ్య ఎగశాయి.
* మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో ఎల్‌అండ్‌టీ, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, సెసాస్టెరిలైట్ 3-2% మధ్య పుంజుకున్నాయి.
* ఐటీ దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ 1.5-1% మధ్య నష్టపోయాయి.
* ఇటీవల ట్రెండ్‌కు విరుద్ధంగా ఎఫ్‌ఐఐలు మళ్లీ రూ. 1,040 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
* మిడ్ క్యాప్ షేర్లలో టొరంట్ పవర్, టీబీజెడ్, సింఫనీ, ఎస్‌కేఎస్, జిందాల్ సా, యునెటైడ్ స్పిరిట్స్, పీవీఆర్ 13-6% మధ్య జంప్‌చేశాయి.

మరిన్ని వార్తలు