ఆల్‌టైమ్‌ గరిష్టంలో నిఫ్టీ ముగింపు

4 Aug, 2018 00:24 IST|Sakshi

రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ 

కొనుగోళ్ల జోష్‌ పెంచిన వర్షపాత అంచనాలు  

సానుకూలంగా సేవల రంగం వృద్ధి

391 పాయింట్ల లాభంతో 37,556కు సెన్సెక్స్‌ 

116 పాయింట్లు పెరిగి 11,361కు నిఫ్టీ  

ఇది ఆల్‌టైమ్‌ హై క్లోజింగ్‌

రెండు రోజుల నష్టాల అనంతరం ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. ఈ నెల, వచ్చే నెలల్లో వర్షాలు సాధారణంగానే కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించడంతో స్టాక్‌ మార్కెట్లో లాభాల వర్షం కురిసింది. ఇటీవలి పతనంతో కుదేలైన బ్యాంక్, ఆర్థిక సేవల రంగ షేర్లలో వేల్యూ బయింగ్‌ చోటు చేసుకోవడం కలసివచ్చింది. కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటం, సేవల రంగం పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎమ్‌ఐ) గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటం వంటి అంశాల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 391 పాయింట్లు పెరిగి 37,556 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 116 పాయింట్ల లాభంతో 11,361 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీకి ఇది జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపు. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఒక్క రోజులో స్టాక్‌ సూచీలు ఇన్నేసి పాయింట్లు లాభపడటం ఒక నెల రోజుల కాలంలో ఇదే మొదటిసారి. బ్యాంక్, లోహ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు బాగా లాభపడ్డాయి. ఇక వారం పరంగా చూస్తే, వరుసగా రెండో వారమూ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 219 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు చొప్పున పెరిగాయి. ఈ ఏడాది జూన్‌లో 52.6గా ఉన్న భారత సేవల రంగం పీఎమ్‌ఐ జూలైతో 54.2కు పెరిగింది. వరుసగా రెండు నెలల్లో సేవల రంగం పీఎమ్‌ఐ పెరగడం సానుకూల ప్రభావం చూపించింది. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో 417 పాయింట్ల లాభంతో 37,582 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. గత రెండు  ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌  మొత్తం 441 పాయింట్లు నష్టపోయింది. వాతావరణ శాఖ సానుకూల వర్షపాత అంచనాలు, బ్యాంక్‌ షేర్లు కోలుకోవడంతో స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరావడం కూడా కలసివచ్చిందని వివరించారు.
  
 లాజిస్టిక్స్‌ షేర్లకు లాభాలు.... 
లాజిస్టిక్స్‌ కంపెనీ టీసీఐ ఎక్స్‌ప్రెస్‌ నికర లాభం ఈ క్యూ1లో 33 శాతం ఎగసింది. దీంతో ఈ షేర్‌ 7 శాతం లాభపడి రూ.692 వద్ద ముగిసింది. దీంతో ఇతర లాజిస్టిక్స్‌ షేర్లు కూడా లాభపడ్డాయి. సికాల్‌ లాజిస్టిక్స్, పటేల్‌ ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్, అల్‌కార్గో లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌ వంటి షేర్లు 2–8 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి.  

2 రోజుల్లో 40% పెరిగిన వెంకీస్‌ ఇండియా 
అదనపు నిఘా చర్యల నిబంధనల జాబితా నుంచి బీఎస్‌ఈ తొలగించిన కంపెనీల జాబితాలో వెంకీస్‌ ఇండియా కూడా ఒకటి. దీంతో ఈ షేర్‌ ఇంట్రాడేలో 20 శాతం ఎగసింది. చివరకు 17 శాతం లాభంతో రూ.3,175 వద్ద ముగిసింది. రెండు ట్రేడింగ్‌ సెషన్లలోనే ఈ షేర్‌ 40 శాతానికి పైగా ఎగియడం విశేషం. కేవలం 11 ట్రేడింగ్‌ సెషన్లలోనే ఈ షేర్‌ 70 శాతం లాభపడింది.  నికర లాభం 58 శాతం పెరగడంతో ఓఎన్‌జీసీ షేర్‌ 0.4% లాభపడి రూ.169 వద్ద ముగిసింది.  యాక్సిస్‌ బ్యాంక్‌ 5.1% లాభంతో రూ. 574 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే.  ఆర్థిక పరిస్థితులు బాగా లేవన్న వార్తలు రావడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ షేర్‌ 7 శాతం నష్టంతో రూ.308 వద్ద ముగిసింది. వేతనాల కోత వంటి వ్యయ నియంత్రణ చర్యలు తీసుకోకుంటే ఈ కంపెనీ రెండు నెలలకు మించి మనలేదని వార్తలు రావడం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు