మార్కెట్లకు ‘బ్రిటన్’ బూస్ట్!

6 Aug, 2016 01:20 IST|Sakshi
మార్కెట్లకు ‘బ్రిటన్’ బూస్ట్!

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ రేట్ల కోత, ఉద్దీపనలతో ప్రపంచ మార్కెట్ల జోరు...
సెన్సెక్స్ 354 పాయింట్లు జూమ్; మళ్లీ 28 వేల పైకి...
నిఫ్టీ 132 పాయింట్లు అప్..8,683 వద్ద ముగింపు...
జీఎస్‌టీ బిల్లుకు ఆమోదంతో పెరిగిన సెంటిమెంట్...

ముంబై: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) ప్రకటించిన భారీ ఉద్దీపన ప్యాకేజీ.. ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు జోరందుకోవడంతో దేశీ సూచీలు కూడా పరుగులు తీశాయి. దీనికితోడు వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లుకు చరిత్రాత్మక ఆమోదం కూడా సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేసింది. మొత్తంమీద ఈ పరిణామాలతో బీఎస్‌ఈ సెన్సెక్స్ శుక్రవారం 364 పాయింట్లు దూసుకెళ్లి మళ్లీ 28,000 పాయింట్ల పైన స్థిరపడింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 134 పాయింట్లు ఎగబాకి 8,683 వద్ద ముగిసింది.

యూరప్ మార్కెట్ల జోరుకుతోడు... ఆసియాలో ప్రధాన సూచీలు ఎగబాకడంతో శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ క్రితం ముగింపు 27,714తో పోలిస్తే 96 పాయింట్ల గ్యాప్ అప్‌తో మొదలైంది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటూ ఒకానొక దశలో 28,110 పాయింట్ల గరిష్టాన్ని కూడా తాకింది. చివరకు 1.31 శాతం (354 పాయింట్లు) లాభంతో 28,079 వద్ద ముగిసింది. గత నెల 11 తర్వాత (500 పాయింట్లు) సెన్సెక్స్ ఒకే రోజు ఇంతగా పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ విషయానికొస్తే... దాదాపు 50 పాయింట్ల గ్యాప్ అప్‌తో ఆరంభమై మళ్లీ 8,600 స్థాయిని అధిగమించింది. ఇంట్రాడేలో 8,689 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 1.54 శాతం ఎగసి 8,683 వద్ద ముగిసింది.

 జీఎస్‌టీ జోష్...
ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న చరిత్రాత్మక జీఎస్‌టీ బిల్లుకు ఎట్టకేలకు రాజ్యసభలో కీలక ఆమోదం లభించడం... చట్టం అమలుకు కేంద్రం రోడ్‌మ్యాప్‌ను కూడా ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, జీఎస్‌టీ అమలు భారత్ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని... ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం లేకుండానే.. వృద్ధి రేటు జోరందుకోగలదంటూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొనడం కూడా మార్కెట్లలో సెంటిమెంట్‌కు దోహదం చేసింది. మొత్తం మీద జీఎస్‌టీకి పచ్చజెండా, బ్రిటన్ తాజాగా ప్రకటించిన భారీ ఉద్దీపనల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లలో సెంటిమెంట్ మెరుగుపడటం మన మార్కెట్లను పరుగులు పెట్టించినట్లు బీఎన్‌పీ పారిబా మ్యూచువల్ ఫండ్(ఈక్విటీస్) ఫండ్ మేనేజర్ శ్రేయష్ దేవాల్కర్ వ్యాఖ్యానించారు.

 ఇతర ముఖ్యాంశాలివీ...
దేశీ సూచీల జోరుకు ప్రధానంగా వాహన, చమురు-గ్యాస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ షేర్ల ర్యాలీ ఊతమిచ్చింది.

బీఎస్‌ఈలో ఆటోమొబైల్ రంగం సూచీ అత్యధికంగా 3.14% దూసుకెళ్లింది. ఇక చమురు-గ్యాస్ ఇండెక్స్ 2.74%, మెటల్స్ 2.56 శాతం, క్యాపిటల్ గూడ్స్ సూచీ 2.34 శాతం, బ్యాంకింగ్ సూచీ 2 శాతం చొప్పున లాభపడ్డాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో హీరోమోటోకార్ప్ 5.02% ఎగసి టాప్‌లో నిలిచింది. ఇక బజాజ్ ఆటో(4.38 శాతం), యాక్సిస్ బ్యాంక్(3.62%), టాటా మోటార్స్(3.21%), ఎస్‌బీఐ(3.21%), ఎంఅండ్‌ఎం(3.16%), ఎల్‌అండ్‌టీ(2.88%), అదానీ పోర్ట్స్(2.61%), ఓఎన్‌జీసీ(2.59%), భారీగా లాభపపడ్డాయి.

ఇక సన్‌ఫార్మా(0.79%), పవర్‌గ్రిడ్(0.67%) చొప్పున నష్టపోయాయి.

టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో.... 0.65 శాతం వరకూ నష్టపోయాయి.

ఇక శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 436 కోట్ల నికర పెట్టుబడులు వెచ్చించారు. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐ) కూడా రూ.616 కోట్లను నికరంగా వెచ్చించడం గమనార్హం.

శుక్రవారం కూడా యూరప్ మార్కెట్లు.. భారీ లాభాలతో ముగిశాయి. బ్రిటన్ సూచీ ఎఫ్‌టీఎస్‌ఈ 0.8%, ఫ్రాన్స్ 1.5%, జర్మనీ 1.4% చొప్పున ఎగబాకాయి. ఇక అమెరికా సూచీలూ లాభాలతోనే ఆరంభమయ్యాయి. కడపటి సమాచారం మేరకు డోజోన్స్ 0.8%, నాస్‌డాక్ 1.2% చొప్పున లాభాలతో ట్రేడవుతున్నాయి.

బ్రిటన్ ప్యాకేజీ ఇదీ...
యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్), అక్కడి ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో బీఓఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్యంగా రుణాలు మరింత చౌకగా అందుబాటులో ఉండేలా కీలక వడ్డీరేటును ఇప్పుడున్న 0.5 శాతం నుంచి పావు శాతం తగ్గించి 0.25 శాతానికి చేర్చింది. 322 ఏళ్ల బీఓఈ చరిత్రలో ఇదే రికార్డు కనిష్టస్థాయి. 2009 తర్వాత తొలి రేటు కోత కూడా. మరోపక్క, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు వీలుగా ఇప్పటికే అమలవుతున్న ఉద్దీపన ప్యాకేజీకి తాజాగా మరింత జతచేసింది. వచ్చే ఆరు నెలలపాటు అదనంగా 60 బిలియన్ పౌండ్ల(79 బిలియన్ డాలర్లు) ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు బీఓఈ ప్రకటించింది.

దీనికితోడు కార్పొరేట్లకు మరిన్ని నిధులను అందించేచర్యల్లో భాగంగా వారి నుంచి 10 బిలియన్ పౌండ్ల విలువైన బాండ్‌లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. తగ్గిన వడ్డీరేట్లను రుణగ్రహీతలకు పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు 100 బిలియన్ పౌండ్ల వరకూ నిధులను బ్యాంకులకు ఇవ్వనున్నట్లు కూడా బీఓఈ తాజా సమావేశంలో నిర్ణయించింది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణ కార్యాచరణ చాలా అవసరం. అందుకే ఈ చర్యలు చేపట్టాం. దీనివల్ల అనిశ్చితికి తెరదించడంతోపాటు విశ్వాసం పెంచేందుకు వీలవుతుంది. అంతేకాదు మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు చేయూత లభిస్తుందని భావిస్తున్నాం’ అని బీఓఈ గవర్నర్ మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు