తక్షణ అవరోధం 36,480

31 Dec, 2018 04:22 IST|Sakshi

మార్కెట్‌ పంచాంగం

నాటకీయంగా గతవారం ద్వితీయార్థంలో అమెరికాతో పాటు జపాన్, యూరప్‌ తదితర ధనిక మార్కెట్లు కుదుటపడిన నేపథ్యంలో తీవ్ర పతనం నుంచి భారత్‌ సూచీలు సైతం కోలుకున్నాయి. అయితే అమెరికా మార్కెట్ల రికవరీ తక్కువ ట్రేడింగ్‌ పరిమాణంతో జరుగుతున్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా బుల్స్‌ను ఆందోళనపర్చే అంశం. అయితే సాధారణంగా జనవరి తొలివారంలో దాదాపు ప్రపంచ సూచీలన్నీ స్థిరంగా ట్రేడవుతూవుంటాయి. జనవరి రెండోవారంలో ఒడిదుడుకులు మొదవుతుంటాయి. ఈ సందర్భంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ మార్కెట్‌లో పెట్టుబడుల్ని పునర్‌ప్రారంభిస్తారా, అమ్మకాలకు తెరతీస్తారా అనే అంశం సమీప భవిష్యత్తులో మన మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశించగలదు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే...  

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
డిసెంబర్‌ 28తో ముగిసిన వారం ప్రధమార్థంలో 35,010 పాయింట్ల కనిష్టస్థాయివరకూ పతనమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ద్వితీయార్థంలో వేగంగా 36,195 పాయింట్ల స్థాయికి కోలుకుంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 335 పాయింట్ల లాభంతో 36,077 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం కూడా అప్‌ట్రెండ్‌ కొనసాగితే సెన్సెక్స్‌కు 36,480 పాయింట్ల వద్ద తక్షణఅవరోధం కలగవచ్చు. అటుపైన 36,560 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే ర్యాలీ 36,620–36,800 పాయింట్ల వరకూ కొనసాగవచ్చు. ఈ వారం తొలి అవరోధాన్ని అధిగమించలేకపోతే 35,780 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌కు తక్షణ మద్దతు లభిస్తోంది. ఈ మద్దతు దిగువన 35,580 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున ముగిస్తే తిరిగి 35,000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.   

నిఫ్టీ తక్షణ నిరోధం 10,965
గతవారం ప్రధమార్ధంలో 10,534 పాయింట్ల వరకూ పతనమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో 10,894 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగింది.  చివరకు అంతక్రితంవారంకంటే 106 పాయి ంట్ల లాభంతో 10,860 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ అప్‌ట్రెండ్‌ కొనసాగితే 10,965 పాయింట్ల వద్ద తక్షణ అవరోధం కలగవచ్చు. అటుపైన 10,985 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిపైన స్థిరపడితే క్రమేపీ 11,035–11,100 పాయింట్ల శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు.  ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోతే నిఫ్టీకి  200 డీఎంఏ రేఖ కదులుతున్న 10,770 పాయింట్ల స్థాయి తక్షణ మద్దతును అందించవచ్చు. ఈ లోపున ముగిస్తే వేగంగా 10,650 పాయింట్ల వరకూ పడిపోవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే తిరిగి 10,535 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.

మరిన్ని వార్తలు