1600 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

25 Mar, 2020 14:20 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లోకి మళ్లాయి. ఆరంభ నష్టాలనుంచి వెనువెంటనే తేరుకున్న సూచీలు  మిడ్ సెషన్ నుంచి  దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 1600  పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 441  పాయింట్లు  దూసుకుపోయింది.  అన్ని రంగాల  షేర్లు లాభాలతో కళ కళ లాడుతున్నాయి.  సెన్సెక్స్ 28వేల పాయింట్ల స్థాయిని, నిఫ్టీ  8200ల పాయింట్ల స్థాయిని సునాయాసంగా అధిగమించింది.
 కోవిడ్ -19   విస్తరణ నేపథ్యంలో ద్రవ్య సమస్యలు అధిగమించేందుకు ప్రధానంగా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు బ్యాంకు క్రెడిట్ లైన్ ను ప్రకటించడంతో బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల జోరునెలకొంది.  నిఫ్టీ బ్యాంక్ సూచీ ఆ సమయంలో 5.7 శాతం పెరిగింది.యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ , హెచ్‌డిఎఫ్‌సి 7 శాతం నుంచి 10 శాతం  ఎగిసాయి. 

వీటితోపాటు హిందూస్తాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తదితర బ్యాంకింగ్ షేర్లు లాభపడుతున్నాయి.  మరోవైపు ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఎల్ అండ్ టీ ,  ఒఎన్‌జీసీ నష్టపోతున్నాయి.
దీనికితోడు వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనాపై పోరాటానికి అమెరికా కాంగ్రెస్ 2-ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ఆమోదించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీలు బుధవారం  భారీగా పుంజుకున్నాయి. దీంతో  దేశీయ ఈక్విటీ మార్కెట్ ఉగాదివేళ కొనుగోళ్లతో కళకళలాడుతోంది.

చదవండి : కరోనా క్రాష్‌ : రూ 13.88 లక్షల కోట్ల సంపద ఆవిరి

మరిన్ని వార్తలు