37,700 మద్దతు కోల్పోతే డౌన్‌ట్రెండ్‌

25 Mar, 2019 05:25 IST|Sakshi

మార్కెట్‌ పంచాంగం

ప్రపంచ మార్కెట్లను అనుసరిస్తూ భారత్‌ మార్కెట్‌సైతం కదంతొక్కుతున్న సమయంలోనే... వడ్డీ రేట్ల పెంపుదలను, బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి నిధుల ఉపసంహరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అనూహ్యంగా అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చేసిన పాలసీ ప్రకటన ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. అలాగే అమెరికా వృద్ధి రేటు అంచనాల్ని కూడా ఫెడ్‌ తగ్గించింది. ఇప్పటికే యూరప్, చైనా, జపాన్‌ల వృద్ధి రేటు అంచనాల్లో కోతపడగా, అమెరికా కూడా ఈ బాటలోకి రావడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ ట్రెండ్‌ కొద్దిరోజులపాటు కొనసాగవచ్చన్న అంచనాల్ని తాజాగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే,  

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
మార్చి 22తో ముగిసిన వారం చివరిరోజైన శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన రెండో నిరోధం సమీపస్థాయి అయిన 38,565 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత హఠాత్తుగా అమ్మకాలు వెల్లువెత్తడంతో వారం మొత్తంమీద ఆర్జించిన లాభాల్లో చాలావరకూ కోల్పోయింది. చివరకు అంతక్రితంవారంకంటే 141 పాయింట్ల స్వల్పలాభంతో 38,165 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం అమెరికా సూచీలు భారీ పతనాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో మార్కెట్‌ ప్రారంభమైతే సెన్సెక్స్‌కు 37,700 పాయింట్ల సమీపంలో కీలక మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే డౌన్‌ట్రెండ్‌ వేగవంతమై 37,480 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 37,230 వద్దకు క్షీణించవచ్చు. ఈ వారం తొలి మద్దతును పరిరక్షించుకోగలిగితే తొలుత 38,320 వద్దకు పెరగవచ్చు. అటుపైన   38,730 పాయింట్ల వరకూ పరుగు కొనసాగవచ్చు.  

నిఫ్టీ తక్షణ మద్దతు 10,345
గత వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,572  పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత చివరకు  అంతక్రితంవారంతో పోలిస్తే 30 పాయింట్ల స్వల్పలాభంతో 11,457  వద్ద ముగిసింది. ప్రపంచ ప్రతికూల సంకేతాల కారణంగా ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో మొదలైతే నిఫ్టీకి 10,345 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. వారంరోజుల క్రితం ఇదేస్థాయిని అధిగమించి, నిఫ్టీ మరో 200 పాయింట్లకుపైగా పెరిగినందున, ఈ వారం ఇదేస్థాయి కీలక మద్దతుగా పరిణమించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 11,275  వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన 11,225  వద్దకు తగ్గవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే తొలుత 11,505 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపై క్రమేపీ తిరిగి 11,570  స్థాయిని చేరవచ్చు. ఆపై క్రమేపీ 11,630  వరకూ పెరగవచ్చు. 

మరిన్ని వార్తలు