అమ్మకాల దెబ్బ : కుప్పకూలిన మార్కెట్లు

23 May, 2018 16:35 IST|Sakshi
కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు (ప్రతీకాత్మక చిత్రం)

ముంబై : గ్లోబల్‌ స్టాక్‌మార్కెట్ల నుంచి బలహీనమైన సంకేతాలు, రూపాయి విలువ క్షీణించడం నేపథ్యంలో నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు, చివరికి కుప్పకూలాయి. అమ్మకాల ఒత్తిడి భారీగా తాకడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 306 పాయింట్లు పతనమై 34,345 వద్ద నిలవగా.. నిఫ్టీ 106 పాయింట్లు కోల్పోయి 10,430 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ దాదాపు 100 పాయింట్లకు పైగా కిందకి పడిపోయింది. నేటి ట్రేడింగ్‌లో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోగా.. మెటల్‌ అ‍త్యధికంగా 4 శాతం మేర పతనమైంది. హెచ్‌పీసీఎల్‌, వేదంతా, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. 

మరోవైపు బ్యాంకింగ్‌ సెక్టార్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఐడీబీఐ బ్యాంకులు 4 నుంచి 7 శాతం మధ్యలో పైకి ఎగిశాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టపోవడంతో ఆ ఎఫెక్ట్‌ ఆసియా, యూరప్‌ మార్కెట్లపై పడిందని, దీంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు చెప్పారు. దీనికితోడు రూపాయి ఏడాదిన్నర కనిష్టం 68.28ను తాకడం కూడా ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనలకు గురిచేసినట్టు తెలిపారు. ప్రపంచ సంకేతాలు, క్రూడ్‌ ఆయిల్‌, రూపాయి విలువ పతనంతో మరికొన్ని సెషన్లు కూడా ఇదే విధంగా కొనసాగనున్నాయని రెలిగేర్‌ బ్రోకింగ్‌ అధ్యక్షుడు జయంత్‌ మంగ్‌లిక్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు