మళ్లీ ఢమాలన్న స్టాక్‌మార్కెట్లు

24 Sep, 2018 14:35 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఆరంభంలో సానుకూలంగా ఉన్నా అమ్మకాల ఒత్తిడితో నష్టాలలోకి  జారుకున్నాయి. ఏ కోశానా కోలుకునే  ధోరణి కనిపించలేదు. దీంతో సెన్సెక్స్‌ 589 పాయింట్లు పతనమై 36252వద్ద, నిఫ్టీ1 92 పాయింట్లు దిగజారి 10,951 వద్ద ట్రేడవుతోంది. తద్వారా 11,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. ఒక్క ఐటీ తప్ప అన్ని సెక్టార్లు నేల చూపులు  చూస్తున్నాయి.  రియల్టీ 5శాతం, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌, ఫార్మా 3 నుంచి 2శాతం మధ్య పతనమయ్యాయి. ఎంఅండ్ఎం, ఐబీ హౌసింగ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీపోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్‌, ఐషర్, ఇండస్‌ఇండ్, లుపిన్‌,బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ నష్టాల్లో కొన సాగుతున్నాయి. టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌పీసీఎల్‌, కోల్‌ఇండియా,యస్‌బ్యాంక్‌, హిందాల్కో,ఎన్‌టీపీసీ, ఆర్‌ఐఎల్‌, ఓఎన్‌జీసీ  లాభపడుతున్నాయి.

ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య దిగుమతి సుంకాలు నేటినుంచి అమల్లోకిరానున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ట్రేడ్‌ వార్‌ భయాలు,  పెరుగుతున్న చమురు ధరలు, ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ ఆందోళనలు, విదేశీ మదుపర్ల అమ్మకాలతో పాటు టెక్నికల్‌గా సపోర్టు లెవల్స్‌  బ్రేక్‌ అవడం తదితర అంశాలు మార్కెట్లను బలహీన పరుస్తున్నట్టు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు దేశీయ కరెన్సీ రుపీ కూడా ఇదే బాటలో  ఉంది.  డాలరు మారకంలో 41పాయింట్లు క్షీణించిన రూపాయి 72.62వద్ద ఉంది. ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు మరింత పైకి ఎగిసాయి.  బ్రెంట్‌ క్రూడ్‌ ధర 80 డాలర్లను అధిగమించింది.

మరిన్ని వార్తలు