సెన్సెక్స్‌కు 114 పాయింట్లు నష్టం

10 Jul, 2015 01:00 IST|Sakshi
సెన్సెక్స్‌కు 114 పాయింట్లు నష్టం

♦ వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే  
♦ 34 పాయింట్లు నష్టపోయి 8,329కు నిఫ్టీ
 
 అంతర్జాతీయ మార్కెట్లు రికవరీ బాట పట్టినప్పటికీ మన స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లోనే ముగిసింది. వరుసగా మూడో రోజు కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు నష్టపోయి 27,574 పాయింట్ల వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 8,329 పాయింట్ల వద్ద ముగిశాయి.  వాహన, ఆయిల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టపోగా, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా షేర్ల నుంచి మార్కెట్‌కు మద్దతు లభించింది.   

 క్యాపిటల్ గూడ్స్ షేర్ల జోరు... మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు(శుక్రవారం) వెలువడనున్న నేపథ్యంలో భెల్, ఎల్ అండ్ టీ తదితర క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభపడ్డాయి.  హిందాల్కో, హీరోమోటొకార్ప్, భారతీ ఎయిర్‌టెల్, లుపిన్ షేర్లు లాభాల బాట పట్టాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో టీసీఎస్ షేర్‌తో పాటు ఇతర ఐటీ షేర్లు-ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్  కూడా తగ్గాయి. వేదాంత  టాటా మోటార్స్ , బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, ఎన్‌టీపీసీలు 1-5 శాతం రేంజ్‌లో తగ్గాయి.  
 
 చైనా షాంఘై ఎక్స్ఛేంజ్ రికవరీ

 ఆసియా మార్కెట్లను బుధవారం వణికించిన చైనా షాంగై ఇండెక్స్ గురువారం శాంతించింది. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలతో  ఈ సూచీ 5.6% లాభపడింది.  ఈ సూచీ ఒక్క రోజు ఇంత పెరగడం ఆరేళ్లలో ఇదే మొదటిసారి. మూడు వారాల్లో ఇన్వెస్టర్లు 3.2 లక్షల కోట్ల డాలర్లు నష్టపోయిన ఉదంతంపై దర్యాప్తు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించడం ప్రభావం చూపింది.

మరిన్ని వార్తలు