భారీ నష్టాల నుంచి రికవరీ

16 May, 2020 04:19 IST|Sakshi

25 పాయింట్ల నష్టంతో 31,098కు సెన్సెక్స్‌

6 పాయింట్లు తగ్గి 9,137కు నిఫ్టీ   

ఆర్థిక ప్యాకేజీ ద్రవ్యలోటుపై భారం మోపుతుందనే ఆందోళనతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో స్టాక్‌ సూచీలు స్వల్పంగా క్షీణించాయి. కరోనా  కేసులు పెరుగుతుండటం, ముడి చమురు ధరలు 2% మేర పెరగడం, అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 350 పాయింట్ల మేర నష్టపోయినప్పటికీ, సెన్సెక్స్‌ చివరకు 25 పాయింట్ల నష్టంతో 31,098 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 9,137 పాయింట్ల వద్దకు చేరింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 545 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.  

526 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌....
సెన్సెక్స్‌ లాభాల్లో ఆరంభమైనా, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం తర్వాత లాభ,నష్టాల మధ్య దోబూచులాడి చివరకు స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఒక దశలో 173 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్‌ మరో దశలో 353 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 526 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ట్రేడింగ్‌ చివర్లో కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో నష్టాలు తగ్గాయి. రియల్టీ, బ్యాంక్, వాహన,ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ జరగ్గా, ఇంధన,లోహ,టెలికం షేర్లలో వేల్యూ బయింగ్‌ జరిగింది.

► మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ 5 శాతం మేర నష్టంతో రూ.381 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  

► దాదాపు 40కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఇండియా సిమెంట్స్, అజంతా ఫార్మా, అలెంబిక్‌ ఫార్మా, ఆర్తి డ్రగ్స్, రుచి సోయా తదితర షేర్లు వీటిలో ఉన్నాయి.  

► చైనాలో గత నెలలో పారిశ్రామిక వృద్ధి పుంజుకుందన్న వార్తలతో లోహ షేర్లు లాభపడ్డాయి.

>
మరిన్ని వార్తలు