నీలేకని జోష్‌: టాప్‌ గెయినర్‌గా ఇన్ఫీ

28 Aug, 2017 09:55 IST|Sakshi
నీలేకని జోష్‌: టాప్‌ గెయినర్‌గా ఇన్ఫీ

ముంబై:  బోర్డ్‌ వార్‌ సంక్షోభంతో  మార్కెట్‌ క్యాప్‌ను భారీగా నష్టపోయిన  సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌  సోమవారం  నాటి మార్కెట్లో లాభాలతో దూసుకుపోతోంది.   ఇటీవలి పరిణామాలకు చెక్‌ పెడుతూ కొత్త ఛైర్మన్‌గా  నందన్‌నీలేకని  రంగంలోకి దిగడంతో ఈ షేర్‌కు బూస్ట్‌  లభించింది.  ముఖ్యంగా  ఇన్ఫోసిస్‌లో స్థిరత్వానికి  ఛైర‍్మన్‌ నందన్‌నీలేకని హామీ ఇవ్వడంతో ఈ స్టాక్‌పై ఇన్వెస్టర్లు  మొగ్గుచూపుతున్నారు.  దీంతో లాంగ్‌ వీకెండ్‌ తరువాత మొదలైన మార్కెట్లలో భారీ కొనుగోళ్లతో  టాప్‌ గెయినర్‌గా నిలిచింది.3 శాతానికి పైగా లాభపడి 944 వద్ద  కొనసాగుతోంది.

ఒకప్పటి చైర్మన్‌, సహవ్యవస్థాపకులు నందన్‌ నీలేకని తాజాగా తిరిగి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవిని చేపట్టారు.   వెంటనే ఇన్వెస్టర్లతో, వాటాదారులతో  సమావేశం నిర్వహించి, భద్రతకు,  స్థిరత్వానికి హామీ ఇచ్చారు.  అంతేకాదు తన పదవీ కాలం ఎన్నాళ్లు ఉంటుందనేది  బోర్డు తనకు చెప్పలేదనీ, కానీ   కంపెనీ కార్యకలాపాల్లో స్థిరత్వాన్ని తీసుకువచ్చేవరకూ   చైర్మన్‌ పదవిలో కొనసాగనున్నట్లు నీలేకని  హామీ ఇవ్వడం సానుకూల అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు రూ.13,000 కోట్లతో సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)ఆఫర్‌ కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.  

కాగా ఇన్ఫోసిస్‌ ప్రమోటర్లలో ఒకరైన నారాయణమూర్తి కంపెనీ కార్పొరేట్‌ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఈవో, ఎండీ పదవులకు విశాల్‌ సిక్కా గత వారంలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు