డబుల్‌ సెంచరీ లాభాలతో సెన్సెక్స్‌ ప్రారంభం

30 Jun, 2020 09:29 IST|Sakshi

80 పాయింట్ల లాభంతో మొదలైన నిఫ్టీ

మెటల్‌, అటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు 

నష్టాల్లో ఐటీ షేర్లు

దేశీయ మార్కెట్‌ మంళవారం భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభంతో 35162 వద్ద, నిఫ్టీ 80 పెరిగి 10390 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా మెటల్‌, అటో రంగ షేర్లు లాభపడుతున్నాయి. కరోనా కట్టడికి కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ల ఎత్తివేతలో భాగంగా నేటితో అన్‌లాక్ 1.0 ముగిసింది. రేపటి నుంచి అన్‌లాక్ 2.0 ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా కేంద్రం మార్గదర్శకాల ప్రకారం అనేక ఆర్థిక కలాపాలు పున:ప్రారంభం కావాల్సి ఉంది. ఈ అంశం ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చినట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు సైతం లాభాల్లో కదులుతుండటం మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది.  

దేశ ప్రధాని మోదీ నేడు సాయంత్రం 4గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చైనాకు చెందిన 59రకాల యాప్‌లపై నిషేధం, అన్‌లాక్‌ 2.0 ప్రక్రియ, సరిహద్దు వివాదాల్లో తాజా పరిస్థితులపై మోదీ మాట్లాడవచ్చని తెలుస్తోంది. వోడాఫోన్‌ ఐడియా, ఓఎన్‌జీసీ, సెయిల్‌తో పాటు సుమారు 596 కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తత వహించే అవకాశం ఉంది.

నిఫ్టీ 50 ఇండెక్స్‌లో... యాక్సిస్‌బ్యాంక్‌, టాటామోటర్స్‌, హిందాల్కో, యూపీఎల్‌, టాటాస్టీల్‌ షేర్లు 2శాతం నుంచి 4శాతం లాభడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, గెయిల్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, టీసీఎస్‌ షేర్ల 0.10శాతం నుంచి 1శాతం నష్టపోయాయి.

మరిన్ని వార్తలు