మరోసారి మార్చి కనిష్ఠాలకు మార్కెట్‌???

26 May, 2020 14:35 IST|Sakshi

రాయిటర్స్‌ పోల్‌లో నిపుణుల అంచనా 

ఏడాది చివర్లో కాస్త రికవరీ ఛాన్సులు

దేశీయ మార్కెట్లు ఈ ఏడాది నష్టాల నుంచి కోలుకోవని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తొమ్మిదేళ్లలో 2020 అత్యంత అధ్వాన్న ప్రదర్శన చూపుతుందని అంచనా వేస్తున్నారు. ఎకానమీలో భారీ డౌన్‌ట్రెండ్‌, వ్యాపారకార్యకలాపాలు పడకేయడం.. మార్కెట్‌ను కోలుకోలేకుండా చేస్తాయని రాయిటర్స్‌ పోల్‌లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మార్చి 24న నమోదు చేసిన 25639 పాయింట్ల కనిష్ఠాన్ని సెన్సెక్స్‌ ఈ ఏడాది మరోమారు తాకవచ్చని పోల్‌లో పాల్గొన్న అనలిస్టుల్లో 55 శాతం మంది అంచనా వేశారు. ఇది వచ్చే సెప్టెంబర్‌లోనే జరగవచ్చన్నారు. మార్చి కనిష్ఠాల నుంచి మార్కెట్‌ దాదాపు 20 శాతం రికవరీ చూపింది. కానీ ఈ ఏడాది తాకిన ఆల్‌టైమ్‌హై నుంచి దాదాపు 26 శాతం దిగువన ఉంది. ఆర్‌బీఐ పలు చర్యలు చేపట్టినా, ప్రభుత్వం భారీ ప్యాకేజీ ఇచ్చినా సూచీలు పెద్దగా ర్యాలీ జరపలేకపోవడం బలహీనతకు నిదర్శనమని అనలిస్టులు భావిస్తున్నారు. సెన్సెక్స్‌ ఈ ఏడాది చివరకు కాస్త రికవరీ చూపవచ్చని, డిసెంబర్‌ నాటికి సెన్సెక్స్‌ 31960 పాయింట్లను చేరవచ్చని సర్వేలో పాల్గొన్న నిపుణులు సరాసరిన అంచనా వేశారు. అప్పటికీ ఈ ఏడాది మొత్తం మీద సెన్సెక్స్‌ దాదాపు 22.5 శాతం నష్టాన్ని నమోదు చేసినట్లవుతుంది. 2011 తర్వాత ఈ స్థాయిలో సూచీలు అధ్వాన్న ప్రదర్శన జరపడం ఇదే తొలిసారి కానుంది. 


మూడునెలల క్రితం ఇదే రాయిటర్స్‌ సర్వేలో నిపుణులు సెన్సెక్స్‌ సంవత్సరాంతపు టార్గెట్‌ 43560 పాయింట్లుగా అంచనా వేశారు. తాజా అంచనాల ప్రకారం వచ్చే ఏడాది మధ్యనాటికి సెన్సెక్స్‌ 35500 పాయింట్లు, 2021 చివరకు 38000పాయింట్లకు చేరవచ్చు. ఈ ఏడాది జనవరిలో సెన్సెక్స్‌ 42274 పాయింట్ల ఆల్‌టైమ్‌హైని తాకింది. ప్రస్తుతం దేశీయ సూచీలు వాల్యూషన్లపరంగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని, కానీ ఎకానమీలో ఇబ్బందులు, రికవరీలో జాప్యం కారణంగా సూచీల్లో లాభాలు చాలా పరిమితంగా ఉంటాయని క్యాపిటల్‌ ఎకనామిక్స్‌ అనలిస్టు శిలాన్‌షా చెప్పారు. దేశీయ ఎకానమీకి రాబోయే మూడునెలల్లో అధిక నిరుద్యోగిత అధిక ముప్పని సర్వేలో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. వచ్చే ఒకటి రెండు త్రైమాసికాలు కార్పొరేట్‌ ఫలితాలు బాగా దెబ్బతింటాయని కూడా సర్వేలో అత్యధికులు భావించారు. ఆగస్టు- సెప్టెంబర్‌ నాటికి సూచీలు మరోమారు మార్చి కనిష్ఠాలను చూస్తాయని, అనంతరమే కాస్త రికవరీ ఉంటుదంని ఏంజల్‌ బ్రోకింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ముందు లోతైన అధ్యయనం జరపాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు