బ్యాంక్‌ షేర్ల జోరు

28 Dec, 2019 03:10 IST|Sakshi

ఆర్‌బీఐ ఆపరేషన్‌ ట్విస్ట్‌

మూడు పీఎస్‌బీలకు పెట్టుబడులు

లాభాల్లో బ్యాంక్‌ షేర్లు

411 పాయింట్ల లాభంతో 41,575కు సెన్సెక్స్‌

119 పాయింట్లు పెరిగి 12,246కు నిఫ్టీ 

నేడు బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి భేటీ

బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు శుక్రవారం దుమ్ము రేపాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా లాభపడ్డాయి. దీంతో మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటంతో సెన్సెక్స్‌ కీలకమైన 41,500 పాయింట్లపైకి, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,200 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. జనవరి సిరీస్‌ డెరివేటివ్స్‌ పటిష్టమైన లాభాలతో ఆరంభమైంది.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 411 పాయింట్ల లాభంతో 41,575 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 119 పాయింట్ల ఎగసి 12,246 వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు తగ్గి 71.36ను తాకినప్పటికీ, (ఇంట్రాడేలో) మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది. అయితే వారం మొత్తంగా చూస్తే మాత్రం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. బుధవారం క్రిస్మస్‌ సెలవు కారణంగా ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులే జరిగింది. ఈ నాలుగు రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 107 పాయింట్లు, నిఫ్టీ 26 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి.  

నాలుగు సెన్సెక్స్‌ షేర్లకే నష్టాలు....
శుక్రవారం సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ట్రేడింగ్‌ జరుగుతున్న కొద్దీ లాభాలు పెరుగుతూ పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 447 పాయింట్ల లాభంతో 41,611 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. మొత్తం 411 పాయింట్ల సెన్సెక్స్‌ లాభాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ.. ఈ నాలుగు షేర్ల లాభాలే సగానికి (240 పాయింట్లు) పైగా ఉన్నాయి. మొత్తం 30 సెన్సెక్స్‌ షేర్లలో నాలుగు షేర్లే (అల్ట్రాటెక్‌ సిమెంట్, టైటాన్, టీసీఎస్, కోటక్‌ బ్యాంక్‌)  నష్టపోయాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 2.6% లాభంతో రూ.755 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా  లాభపడిన షేర్‌ ఇదే.

లాభాలు ఎందుకంటే....
1. బ్యాంక్‌ షేర్ల ర్యాలీ...
ఆపరేషన్‌ ట్విస్ట్‌లో భాగంగా ఆర్‌బీఐ సోమవారం నాడు రూ.20,000 కోట్ల విలువైన బాండ్ల క్రయ, విక్రయాలు జరపనుంది. ఫలితంగా బ్యాంక్‌ల ట్రెజరీ లాభాలు పెరుగుతాయి. పనితీరు, వ్యాపార వృద్ధి తదితర అంశాలపై చర్చించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు (శనివారం) భేటీ కానున్నారు కూడా. ఈ సమావేశం నుంచి సానుకూల వార్తలు రానున్నాయన్న అంచనాలు పెరిగాయి. మరోవైపు మూడు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు (అలహాబాద్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, ఐఓబీ) కేంద్రం పెట్టుబడులు అందించింది. దీనితో  బ్యాంక్‌ షేర్లు జోరుగా పెరిగాయి.  

2. అమెరికా– చైనా మధ్య ఒప్పందం  
అమెరికా– చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం తొలి దశ ఒప్పందంపై త్వరలోనే సంతకాలు జరగనున్నాయన్న తాజా వార్తలు మార్కెట్లో సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి.   

3. కొనసాగుతున్న విదేశీ కొనుగోళ్లు....
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు రూ.6,251 కోట్ల మేర నికర పెట్టుబడులు పెట్టారు. నవంబర్‌లో రూ.25,231 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన విదేశీ మదుపర్లు మొత్తం మీద ఈ ఏడాదిలో మన స్టాక్‌ మార్కెట్లో రూ. లక్ష కోట్ల మేర పెట్టుబడుల పెట్టారు.  

మరిన్ని వార్తలు