నీరవ్‌, చోక్సీలకు భారీ షాక్‌

22 Aug, 2018 09:03 IST|Sakshi

నీరవ్‌ మోదీ, మెహుల్‌  చోక్సీ అక్రమ బంగ్లాల కూల్చివేతకు ఆదేశాలు

సాక్షి,ముంబై: పీఎన్‌బీ స్కాంలో ప్రధాన నిందితులు, డైమండ్‌ వ్యాపారులు నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీలకు భారీ షాక్‌ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు రూ.13 వేల కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో దాక్కున్ననీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల అక్రమ బంగళాలను కూల్చివేయాలని మహారాష్ట ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. రాయ్‌గడ్‌ జిల్లా కిహిమ్‌ గ్రామంలో ఉన్న నీరవ్‌ మోదీ బంగ్లాను, ఆవాస్‌ గ్రామంలోని చోక్సీ అక్రమ భవనాలను కూల్చివేయనున్నామని  మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి రాందాస్‌ కదం తెలిపారు.  అక్రమ బిల్డింగ్‌ల వ్యవహారంలో ప్రభుత్వ తాత్సారంపై ముంబై హైకోర్టు అంసతృప్తిని, అధికారులపై  ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

మోదీ, చోక్సీలకు చెందిన ఈ బంగ్లాలను ఇప్పటికే ఈడీఎటాచ్‌ చేసింది. కాబట్టి ఈ బంగ్లాల కూల్చివేత ప్రక్రియలో ఈడీ అనుమతి తీసుకున్న తర్వాత  ముందుకు సాగుతామని జిల్లా కలెక్టర్‌ విజయ్‌ సూర్యవంశీ ప్రకటించారు.  

ఆలీబాగ్, మురాద్‌ తీర ప్రాంతంలో మోదీ, చోక్సీలతో పాటు, ఇతర సెలబ్రిటీలు తీరప్రాంత రెగ్యులేషన్ జోన్ (సిఆర్‌జెడ్‌)  నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన బంగళాలు 111 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.  అయితే  కొన్ని బంగళాల యజమానులు వాటిపై చర్యలు తీసుకోకుండా న్యాయస్థానం నుంచి నిలుపుదల ఉత్తర్వులను పొందడంతో  ఈ కేసులను నేషనల్‌ గ్రీన్ ట్రిబ్యునల్‌కు బదిలీ చేశామన్నారు. మరో రెండు మూడునెలల్లో వీటిపై చర్యలు  తీసుకునే అవకాశం ఉందని  మంత్రి వెల్లడించారు.  

మరిన్ని వార్తలు