ఎగవేతదారులు పారిపోకుండా అడ్డుకట్ట ఎలా?

18 Jul, 2018 00:24 IST|Sakshi

సలహాలకు కేంద్ర కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ బడా రుణ ఎగవేతదారులు, ప్రమోటర్లు దేశం వదిలి పారిపోకుండా నిరోధించడం ఎలా అన్న అంశంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి ప్రస్తుత చట్టాల్లో సవరణలు, సూచనలు ఇవ్వడానికి ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ నేతృత్వం వహిస్తారు. 

దేశీయ కంపెనీలకు సంబంధించి ప్రమోటర్ల విషయంలో భారత్‌ కాకుండా ఏ ఇతర దేశంలో పౌరసత్వం ఉంది? ఆ కంపెనీ రుణాల పరిస్థితి ఏమిటి? చెల్లింపులు ఎలా ఉన్నాయి? లాభనష్టాల పరిస్థితి ఏమిటి? ఇలాంటి అన్ని అంశాలపై ముందే దృష్టి సారించాలని  పలువురు భావిస్తున్నారు.

తద్వారా విజయ్‌ మాల్యా, మెహుల్‌ చోక్సి, నీరవ్‌మోదీ తరహా వ్యక్తుల ఉదంతాల పరిస్థితిని నివారించవచ్చన్నది వీరి అభిప్రాయం. ఇదే విషయంపై ఉన్నత స్థాయి కమిటీ దృష్టి సారించే అవకాశం ఉందని సమాచారం. ఈ కమిటీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) ప్రతినిధులు కూడా ఉంటారు. అలాగే హోమ్, విదేశీ వ్యవహారాల శాఖల అధికారులూ సభ్యులుగా ఉంటారు.

మరిన్ని వార్తలు