సైరస్‌ మిస్త్రీకి సుప్రీం షాక్‌..

10 Jan, 2020 12:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టాటా సన్స్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని పునరుద్ధరిస్తూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌క్లాట్‌) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది. టాటా గ్రూప్‌ చీఫ్‌గా సైరస్‌ మిస్ర్తీ పునరుద్ధరణకు గత ఏడాది డిసెంబర్‌లో ఎన్‌క్లాట్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ టాటా సన్స్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారం రోజుల్లోనే స్టే ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. సదరు వాణిజ్య సంస్ధ చీఫ్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి నియమించాలనే ట్రిబ్యునల్‌ నిర్ణయం మొత్తం తీర్పును ప్రభావితం చేసే తీర్పు లోపంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బోబ్డే అభివర్ణించారు.

కాగా ఎన్‌క్లాట్‌ ఉత్తర్వులను సవాల్‌ చేసిన టాటా గ్రూప్‌ మిస్త్రీ పునర్నియామకం  కంపెనీలో వేళ్లూనుకున్న కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలతో పాటు మొత్తం సంస్థ పనితీరుపై ప్రభావం చూపుతుందని పిటిషన్‌లో పేర్కొంది. మిస్ర్తీని టాటా సన్స్‌ చీఫ్‌గా పునరుద్ధరిస్తూ ఎన్‌క్లాట్‌ తీసుకున​ నిర్ణయం చట్టవిరుద్ధమని ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరింది.

చదవండి : టాటా గ్రూప్‌ చైర్మన్‌ హోదా అక్కర్లేదు: సైరస్‌ మిస్త్రీ

>
మరిన్ని వార్తలు