నిఫ్టీకి నేడు 10121-10212 వద్ద రెసిస్టెన్స్‌!

5 Jun, 2020 08:55 IST|Sakshi

నేడు లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌!

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 48 పాయింట్లు ప్లస్‌

యూఎస్‌, యూరప్‌ మార్కెట్లు అటూఇటూ

లాభనష్టాల మధ్య ఆసియా మార్కెట్లు

నేడు (శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 48 పాయింట్లు పుంజుకుని 10,063 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జూన్‌ నెల ఫ్యూచర్స్‌ 10,015 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. భారీ సహాయక ప్యాకేజీలు, లాక్‌డవున్‌ ఎత్తివేతల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి జోరందుకోగలదన్న అంచనాలు కొనసాగుతున్నాయి. దీంతో కొద్ది రోజులుగా అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ బాట పట్టాయి. అయితే గురువారం యూఎస్‌, యూరోపియన్‌ మార్కెట్లలో లాభాల స్వీకరణ కనిపించింది. ఇక ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. దీంతో నేడు దేశీయంగానూ మార్కెట్లు హుషారుగా ప్రారంభమైనప్పటికీ ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. గురువారం హెచ్చుతగ్గుల మధ్య ఆరు రోజుల దేశీ స్టాక్‌ మార్కెట్ల ర్యాలీకి బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్‌ 129 పాయింట్లు క్షీణించి 33,981 వద్ద నిలవగా.. 32 పాయింట్లు నీరసించిన నిఫ్టీ 10,029 వద్ద ముగిసింది.  

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 9,941 పాయింట్ల వద్ద, తదుపరి 9,853 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,121 పాయింట్ల వద్ద, ఆపై  10,212  వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 20,090 పాయింట్ల వద్ద, తదుపరి 19,791 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 20,916 పాయింట్ల వద్ద, తదుపరి 21,442 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2905 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 847 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. ఇక బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1,851 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 782 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు