నేడు మార్కెట్ల లాభాల ఓపెనింగ్‌!

9 Jun, 2020 08:43 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 65 పాయింట్లు ప్లస్‌

యూఎస్‌ మార్కెట్ల జోరు

చరిత్రాత్మక గరిష్టానికి నాస్‌డాక్‌ 

హుషారుగా.. ఆసియా మార్కెట్లు

ఆర్థిక పురోగతిపై అంచనాల ఎఫెక్ట్‌ 

నేడు (మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 10,230 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జూన్‌ నెల ఫ్యూచర్స్‌ 10,165 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. భారీ సహాయక ప్యాకేజీలు, లాక్‌డవున్‌ ఎత్తివేతల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి జోరందుకోగలదన్న అంచనాలు సోమవారం అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో యూఎస్‌ మార్కెట్లు 2-1 శాతం మధ్య లాభపడ్డాయి. కోవిడ్‌-19లోనూ బుల్‌ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ యూఎస్‌ టెక్‌ ఇండెక్స్‌ నాస్‌డాక్‌ సరికొత్త గరిష్టం వద్ద ముగిసింది. ఇక ప్రస్తుతం ఆసియాలోనూ జపాన్‌, కొరియా మినహా మిగిలిన మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడటంతో నేడు దేశీయంగానూ మరోసారి మార్కెట్లు సానుకూలంగా కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. సోమవారం వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 83 పాయింట్లు బలపడి 34,370 వద్ద నిలవగా.. 25 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 10,167 వద్ద స్థిరపడింది.  

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 10,082 పాయింట్ల వద్ద, తదుపరి 9,997 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,291 పాయింట్ల వద్ద, ఆపై  10,414  వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 20,797 పాయింట్ల వద్ద, తదుపరి 20,406 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,693 పాయింట్ల వద్ద, తదుపరి 22,198 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 813 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1238 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 98 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 47 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. 

మరిన్ని వార్తలు