మార్కెట్లు నేడు హుషారుగా...షురూ!

30 Jun, 2020 08:41 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌  నిఫ్టీ 54 పాయింట్లు ప్లస్‌

నిఫ్టీకి 10359-10406 వద్ద రెసిస్టెన్స్‌

సోమవారం యూఎస్‌ మార్కెట్లు జూమ్‌

యూరోపియన్‌ మార్కెట్లు 1 శాతం అప్‌

ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ట్రెండ్‌

నేడు (30న) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 54 పాయింట్లు పుంజుకుని 10,316 వద్ద ట్రేడవుతోంది.సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 10,262 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే.  గత నెల(మే)లో అంచనాలను మించుతూ  పెండింగ్‌ హోమ్‌ సేల్స్‌ ఏకంగా 44 శాతం జంప్‌చేయడంతో సోమవారం యూఎస్‌ మార్కెట్లు 2.3-1.2 శాతం మధ్య ఎగశాయి. అంతకుముందు యూరోపియన్‌ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లన్నీ సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తదుపరి యధాప్రకారం ఒడిదొడుకులను చవిచూడవచ్చని భావిస్తున్నారు.

35,000 దిగువకు
తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో సోమవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు రోజంతా నష్టాలతోనే కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 210 పాయింట్లు క్షీణించి 34,961 వద్ద ముగిసింది. తద్వారా 35,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరగా.. నిఫ్టీ 71 పాయింట్లు తక్కువగా 10,312 వద్ద స్థిరపడింది. రెండో దశ కోవిడ్‌ కేసులు తలెత్తుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డవున్‌కు తెరలేవనున్న అంచనాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 35,032- 34,662 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,245 పాయింట్ల వద్ద, తదుపరి 10,177 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,359 పాయింట్ల వద్ద, ఆపై  10,406 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,110 పాయింట్ల వద్ద, తదుపరి 20,861 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,524 పాయింట్ల వద్ద, తదుపరి 21,689 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) 1937 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1036 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 753 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 1304 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు