నేడు మార్కెట్లకు తిరిగి హుషార్‌!

13 Jul, 2020 08:49 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌  నిఫ్టీ 69 పాయింట్లు ప్లస్‌

శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు అప్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు లాభాల్లో

నిఫ్టీకి 10821-10873 వద్ద రెసిస్టెన్స్‌

నేడు (13న) దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.40 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 69 పాయింట్లు పుంజుకుని 10,842 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 10,773 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రధానంగా బ్యాంకింగ్‌ రంగ కౌంటర్లు జోరు చూపడంతో శుక్రవారం యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లకు బలమొచ్చింది. దీనికితోడు ఫార్మా దిగ్గజం గిలియడ్‌ సైన్సెస్‌ రూపొందిస్తున్న ఔషధం మరింత ప్రభావం చూపుతున్నట్లు వెలువడిన వార్తలు కరోనా వైరస్‌ కట్టడికి సహకరించగలవన్న అంచనాలు పెరిగాయి. ఫలితంగా వారాంతాన యూఎస్‌ మార్కెట్లు 1.5-0.7 శాతం మధ్య ఎగశాయి.ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. దీంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అయితే తదుపరి ఆటుపోట్లను చవిచూడవచ్చని భావిస్తున్నారు.

బ్యాంకింగ్‌ దెబ్బ
ప్రధానంగా పీఎస్‌యూ, ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ కౌంటర్లలో తలెత్తిన అమ్మకాలు శుక్రవారం దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి సెన్సెక్స్‌143 పాయింట్లు క్షీణించి 36,594 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 10,768 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు డీలాపడటంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,714 పాయింట్ల వద్ద, తదుపరి 10,660 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,821 పాయింట్ల వద్ద, ఆపై  10,873 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,201 పాయింట్ల వద్ద, తదుపరి 22,003 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,716 పాయింట్ల వద్ద, తదుపరి 23,033 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

అమ్మకాల జోరు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1031 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 431 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 213 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 803 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే. 
 

మరిన్ని వార్తలు