నేడు మార్కెట్ల లాభాల యూటర్న్‌!

26 Jun, 2020 08:24 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 38 పాయింట్లు అప్‌

నిఫ్టీకి 10369-10449 వద్ద రెసిస్టెన్స్‌!

యూఎస్‌, యూరోపియన్‌ మార్కెట్లు ప్లస్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సానుకూలం

నేటి నుంచి జులై డెరివేటివ్‌ సిరీస్‌ షురూ

నేడు (26న) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. తద్వారా రెండు రోజుల నష్టాలకు చెక్‌ పడే వీలుంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 10,270 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 10,232 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే.  స్ట్రెస్‌ టెస్ట్ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బ్యాంకింగ్‌ దిగ్గజాలకు డిమాండ్‌ పెరగడంతో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో ఇండెక్సులు 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. అంతకుముందు యూరోపియన్‌ మార్కెట్లు సైతం 1.05 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో హాంకాంగ్‌ మినహా మిగిలిన మార్కెట్లు 1-0.5 శాతం మధ్య బలపడి కదులుతున్నాయి. నేడు జులై డెరివేటివ్‌ సిరీస్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశీ మార్కెట్లు కొంతమేర సానుకూలంగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల అమ్మకాల తదుపరి నేడు కొంతమేర కొనుగోళ్ల మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు.


ఆటుపోట్ల మధ్య డీలా
బుధవారం పలుమార్లు హెచ్చుతగ్గుల మధ్య కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 27 పాయింట్లు క్షీణించి 34,842 వద్ద నిలవగా.. నిఫ్టీ 16 పాయింట్ల వెనకడుగుతో  10,289 వద్ద స్థిరపడింది. రెండో దశ కోవిడ్‌-19 కేసుల ఆందోళనలతో బుధవారం అమెరికా మార్కెట్లు పతనంకాగా.. దేశీయంగానూ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి సెన్సెక్స్‌ తొలుత 34,500 వద్ద కనిష్టాన్ని తాకగా.. తదుపరి 35,082 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2020లో 5 శాతం క్షీణత చవిచూడనున్నట్లు ఐఎంఎఫ్‌ తాజాగా వేసిన అంచనాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,203 పాయింట్ల వద్ద, తదుపరి 10,114 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,369 పాయింట్ల వద్ద, ఆపై  10,449 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,054 పాయింట్ల వద్ద, తదుపరి 20,604 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,831 పాయింట్ల వద్ద, తదుపరి 22,156 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐలు భేష్‌
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ.  1051 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 256 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.  బుధవారం ఎఫ్‌ఫీఐలు రూ. 1767 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1525 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు