నేడు మార్కెట్లు తొలుత బౌన్స్‌బ్యాక్‌- ఆపై?!

15 Jul, 2020 08:30 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌  నిఫ్టీ 82 పాయింట్లు ప్లస్‌

మంగళవారం యూఎస్‌ మార్కెట్లు అప్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు లాభాల్లో

నిఫ్టీకి 10721-10835 వద్ద రెసిస్టెన్స్‌

నేడు (15న) దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.25 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 82 పాయింట్లు పుంజుకుని 10,690 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 10,608 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 కట్టడికి ఫార్మా దిగ్గజం మోడర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధిస్తున్న వార్తలతో మంగళవారం యూఎస్‌ మార్కెట్లు 2-1 శాతం చొప్పున ముందంజ వేశాయి. మోడర్నా వ్యాక్సిన్‌పై ఆశలతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. దీంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు తొలుత లాభాలతో ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తదుపరి ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు భావిస్తున్నారు.

కోవిడ్‌-19 షాక్‌
కోవిడ్‌-19 కేసులు అదుపులేకుండా పెరుగుతున్న కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లకు అమ్మకాల షాక్‌ తగిలింది. వెరసి సెన్సెక్స్‌ 661 పాయింట్లు కోల్పోయింది. 36,033 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 195 పాయింట్లు పతనమై 10,607 వద్ద స్థిరపడింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కోరలు చాస్తుండటంతో సెంటిమెంటుకు దెబ్బ తగిలినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడవచ్చన్న ఆందోళనలు పెరిగినట్లు తెలియజేశారు. ఫలితంగా సెన్సెక్స్‌ 36,517 వద్ద ప్రారంభమై 35,877 వరకూ పతనమైంది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,528 పాయింట్ల వద్ద, తదుపరి 10,449 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,721 పాయింట్ల వద్ద, ఆపై 10,835 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,107 పాయింట్ల వద్ద, తదుపరి 20,821 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,794 పాయింట్ల వద్ద, తదుపరి 22,195 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

భారీ అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1566 కోట్లు,  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 650 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 222 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1459 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు