మూడో రోజూ మార్కెట్లు లాభాలతో! 

3 Jul, 2020 08:40 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌  నిఫ్టీ 46 పాయింట్లు ప్లస్‌

రిలయన్స్‌ జియోలో ఇంటెల్‌ పెట్టుబడి

నిఫ్టీకి 10605-10658 వద్ద రెసిస్టెన్స్‌

గురువారం యూఎస్‌ మార్కెట్లు అప్‌ 

ప్రస్తుతం ఆసియాలో సానుకూల ట్రెండ్‌

నేడు (3న) దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.25 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 46 పాయింట్లు బలపడి 10,598 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 10,552 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే.  జూన్‌లో 4.8 మిలియన్‌ ఉద్యోగాల కల్పన జరిగినట్లు కార్మిక శాఖ వెల్లడించడంతో గురువారం యూఎస్‌ మార్కెట్లు 0.5 శాతం లాభపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లన్నీ సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు హుషారుగా ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తదుపరి యధాప్రకారం ఒడిదొడుకులను చవిచూడవచ్చని భావిస్తున్నారు.

జియోలో ఇంటెల్‌
రిలయన్స్‌ జియోలో టెక్‌ దిగ్గజం ఇంటెల్‌ కార్ప్‌ 0.39 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 1895 కోట్లను వెచ్చించనుంది. దీంతో రిలయన్స్‌ జియోలో 25.1 శాతం వాటా విక్రయం ద్వారా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 1.17 లక్షల కోట్లను సమీకరించినట్లయింది. 

వ్యాక్సిన్‌ పుష్‌
యూఎస్‌ ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ఇంక్‌ కోవిడ్‌-19 చికిత్సకు అభివృద్ధి చేస్తున్న ఔషధంపై ఆశలతో గురువారం దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ 429 పాయింట్లు జంప్‌చేసి 35,844 వద్ద ముగిసింది. తద్వారా 36,000 పాయింట్ల మైలురాయికి చేరువలో నిలిచింది. వెరసి రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 928 పాయింట్లు ర్యాలీ చేసింది. నిఫ్టీ సైతం 122 పాయింట్లు పెరిగి 10,552 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,492 పాయింట్ల వద్ద, తదుపరి 10,432 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,605 పాయింట్ల వద్ద, ఆపై  10,658 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,781 పాయింట్ల వద్ద, తదుపరి 21,609 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,235 పాయింట్ల వద్ద, తదుపరి 22,517 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో  గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 557 కోట్ల అమ్మకాలు నిర్వహించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 909 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1696 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1377 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు