నేడు నేలచూపులతో మార్కెట్ల ఓపెనింగ్‌!

15 Jun, 2020 09:02 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 85 పాయింట్లు డౌన్‌

యూఎస్‌, యూరప్‌ మార్కెట్లు ప్లస్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు నష్టాలలో

నేడు (సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 85 పాయింట్లు క్షీణించి 9857 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జూన్‌ నెల ఫ్యూచర్స్‌ 9,942 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వారాంతాన అమెరికా, యూరొపియన్‌ స్టాక్‌ మార్కెట్లు నష్టాలను వీడి 1-0.5 శాతం స్థాయిలో లాభపడ్డాయి. అయితే ప్రస్తుతం ఆసియా అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. కరోనా వైరస్‌ రెండో దశలో మళ్లీ వ్యాపించవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో నేడు దేశీయంగా మార్కెట్లు నీరసంగా ప్రారంభంకావచ్చని నిపుణులు భావిస్తున్నారు. తదుపరి ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా.. వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు తొలుత ఏర్పడిన భారీ నష్టాల నుంచి బయటపడి చివరికి లాభపడిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్‌ 243 పాయింట్లు ఎగసి 33,781కు చేరగా.. నిఫ్టీ 71 పాయింట్లు బలపడి 9,973 వద్ద ముగిసింది.    

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 9679 పాయింట్ల వద్ద, తదుపరి 9,386 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,131 పాయింట్ల వద్ద, ఆపై  10,289 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 19871 పాయింట్ల వద్ద, తదుపరి 19088 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,093 పాయింట్ల వద్ద, తదుపరి 21,531 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1311 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1945 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి.

మరిన్ని వార్తలు