మార్కెట్లు నేడు నేల చూపులతో...

29 Jun, 2020 08:39 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 71 పాయింట్లు డౌన్‌

నిఫ్టీకి 10326-10269 వద్ద సపోర్ట్‌

వారాంతాన యూఎస్‌ మార్కెట్లు మైనస్

‌ప్రస్తుతం ఆసియాలోనూ బలహీన ట్రెండ్‌

నేడు (29న) దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 71 పాయింట్లు క్షీణించి 10,261 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 10,332 వద్ద ముగిసింది.ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. బ్యాంకింగ్‌ దిగ్గజాలు పతనంకావడంతో శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు 2.5 శాతం స్థాయిలో వెనకడుగు వేశాయి. ప్రస్తుతం ఆసియాలో జపాన్‌, కొరియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా,హాంకాంగ్‌, చైనా, తైవాన్‌ 1-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి.  థాయ్‌లాండ్‌ ప్రారంభంకాలేదు. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే వీలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తదుపరి యధాప్రకారం ఒడిదొడుకులను చవిచూడవచ్చని భావిస్తున్నారు.

యాక్సెంచర్‌ దన్ను
సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం యాక్సెంచర్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో  ఐటీ రంగం జోరందుకోవడంతో వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు రెండు రోజుల నష్టాలకు చెక్‌ పెట్టాయి. అంతర్జాతీయ సంకేతాలు సైతం హుషారునివ్వడంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడ్డారు. వెరసి ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్ తిరిగి 35,000 పాయింట్ల కీలక మార్క్‌ ఎగువన ముగిసింది. 329 పాయింట్లు జంప్‌చేసి 35,171 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ 94 పాయింట్లు ఎగసి 10,383 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,326 పాయింట్ల వద్ద, తదుపరి 10,269 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,425 పాయింట్ల వద్ద, ఆపై  10,467 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,347 పాయింట్ల వద్ద, తదుపరి 21,101 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,811 పాయింట్ల వద్ద, తదుపరి 22,030 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 753 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1304 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ.  1051 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 256 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు