నేడు మార్కెట్లు తొలుత వీక్‌- ఆపై!

1 Jul, 2020 08:29 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌  నిఫ్టీ 24 పాయింట్లు మైనస్‌

నిఫ్టీకి 10246-10190 వద్ద సపోర్ట్స్‌

మంగళవారం యూఎస్‌ మార్కెట్లు జూమ్‌

యూరోపియన్‌ మార్కెట్లు అటూఇటుగా

ప్రస్తుతం ఆసియాలో సానుకూల ట్రెండ్‌

నేడు (1న) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 24 పాయింట్లు క్షీణించి 10,235 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 10,259 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే.  లాక్‌డవున్‌ తదుపరి ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా రికవరీ బాటలో సాగనున్న అంచనాలతో మంగళవారం యూఎస్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు పుంజుకున్నాయి. 1-2 శాతం మధ్య ఎగశాయి. అంతకుముందు యూరోపియన్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లన్నీ సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి హుషారుగా ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తదుపరి యధాప్రకారం ఒడిదొడుకులను చవిచూడవచ్చని భావిస్తున్నారు.
చివరి గంటలో
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో మంగళవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరి గంటలో వెనకడుగు వేశాయి. వెరసి సెన్సెక్స్‌ 46 పాయింట్లు క్షీణించి 34,916 వద్ద నిలవగా.. నిఫ్టీ నామమాత్రంగా 10 పాయింట్లు నీరసించి 10,302 వద్ద స్థిరపడింది. అయితే తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలుత సెన్సెక్స్‌ 35,234 వరకూ ఎగసింది. తదుపరి చివర్లో 34,813 దిగువకూ జారింది. ఇక నిఫ్టీ సైతం 10401- 10267 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,246 పాయింట్ల వద్ద, తదుపరి 10,190 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,380 పాయింట్ల వద్ద, ఆపై  10,457 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,171 పాయింట్ల వద్ద, తదుపరి 20,972 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,610 పాయింట్ల వద్ద, తదుపరి 21,849 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం రూ. 2000 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2051 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1937 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1036 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు