నేడు నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌!

7 Jul, 2020 08:32 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌  నిఫ్టీ 46 పాయింట్లు మైనస్‌

నిఫ్టీకి 10702-10640 వద్ద సపోర్ట్స్‌

సోమవారం యూఎస్‌ మార్కెట్ల హైజంప్‌

యూరోపియన్‌ మార్కెట్లు 2 శాతం అప్

‌ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటూ

నేడు (7న) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర బలహీనంగా ప్రారంభమయ్యే వీలుంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.25 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 46 పాయింట్లు క్షీణించి 10,714 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 10,760 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. సోమవారం యూఎస్‌, యూరోపియన్‌ మార్కెట్లు 1.5-2 శాతం మధ్య ఎగశాయి. అయితే ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లు వరుసగా నాలుగు రోజులపాటు ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగే వీలున్నట్లు   భావిస్తున్నారు. దీంతో ఒడిదొడుకుల మధ్య ట్రేడింగ్‌ సాగవచ్చని చెబుతున్నారు.

4 నెలల గరిష్టం
సోమవారం వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకు కట్టుబడటంతో సెన్సెక్స్‌ 466 పాయింట్లు ఎగసి 36,487 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 156 పాయింట్లు జమ చేసుకుని 10,764 వద్ద నిలిచింది. ఇది నాలుగు నెలల గరిష్టంకాగా.. సెన్సెక్స్‌ 36,313 వద్ద ప్రారంభమై 36,667 వరకూ ఎగసింది. ఇక నిఫ్టీ 10,724 వద్ద మొదలై 10,811 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,702 పాయింట్ల వద్ద, తదుపరి 10,640 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,818 పాయింట్ల వద్ద, ఆపై  10,873 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,114 పాయింట్ల వద్ద, తదుపరి 22,028 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,342 పాయింట్ల వద్ద, తదుపరి 22,485 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 348 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 263 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 857 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 332 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు