నేలచూపులతో నేడు మార్కెట్లు!

10 Jul, 2020 08:24 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌  నిఫ్టీ 68 పాయింట్లు డౌన్‌

నిఫ్టీకి 10752-10691 వద్ద సపోర్ట్స్‌

గురువారం యూఎస్‌ మార్కెట్లు వీక్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు నష్టాల్లో

నేడు (10న) దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే వీలుంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 68 పాయింట్లు క్షీణించి 10,775 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 10,843 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే.  పలు రాష్ట్రాలలో కోవిడ్‌-19 కేసులు తిరిగి పెరుగుతున్న నేపథ్యంలో  గురువారం యూఎస్‌ మార్కెట్లు 1.2-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఈ బాటలో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ ప్రతికూల ధోరణి కనిపిస్తోంది. దీంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తదుపరి ఆటుపోట్లను చవిచూడవచ్చని భావిస్తున్నారు.

మళ్లీ దూకుడు
ఐదు రోజుల ర్యాలీకి బుధవారం బ్రేక్‌పడగా.. తిరిగి గురువారం దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంట్రాడే గరిష్టాలకు సమీపంలో నిలిచాయి. సెన్సెక్స్‌ 409 పాయింట్లు జంప్‌చేసి 36,738 వద్ద ముగిసింది. నిఫ్టీ 108 పాయింట్లు ఎగసి 10,814 వద్ద నిలిచింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,752 పాయింట్ల వద్ద, తదుపరి 10,691 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,856 పాయింట్ల వద్ద, ఆపై  10,898 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,721 పాయింట్ల వద్ద, తదుపరి 21,535 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 23,046 పాయింట్ల వద్ద, తదుపరి 23,185 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐలు ఓకే
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 213 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 803 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. ఇక బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 995 కోట్లు, డీఐఐలు రూ. 853 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. అయితే మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 830 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 784 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు