ఐసీఐసీఐపై భగ్గుమన్న షేర్‌ హోల్డర్స్‌

12 Sep, 2018 17:28 IST|Sakshi

వడోదర : ఐసీఐసీఐ బ్యాంక్‌ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఆగ్రహం పెల్లుబుక్కింది. ఐసీఐసీఐ-వీడియోకాన్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఈవో చందా కొచర్‌ను ఏజీఎం తీసుకు రావాలని వాటాదారులు డిమాండ్‌ చేశారు. చందా కొచర్‌, ఆమె కుటుంబ సభ్యులు వీడియోకాన్‌కు రుణాలు జారీ చేసే విషయంలో ‘క్విడ్‌ ప్రో క్వో’ కు పాల్పడ్డారని వస్తున్న ఆరోపణలపై, కొచర్‌ తమకు సమాధానం చెప్పాలని అన్నారు. బోర్డు పారదర్శకంగా వ్యవహరించలేదని వాటాదారులు మండిపడ్డారు. కొచర్‌, ప్రస్తుతం వీడియోకాన్‌ రుణ వివాద విచారణ పూర్తయ్యేంత వరకు సెలవులో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె నేడు(బుధవారం) జరిగిన 24వ వార్షిక సాధారణ సమావేశానికి హాజరు కాలేదు. 

ఐసీఐసీఐ నూతన చైర్మన్‌ చతుర్వేది ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఈ సమావేశం జరిగింది. కానీ ఈ సమావేశంలో వాటాదారులు ఆగ్రహం పెల్లుబికింది. తమ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం దొరకడం లేదని వాటాదారుల మండిపడ్డారు. బ్యాంక్‌లో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదంటూ వాటాదారులు హెచ్చరించారు. తమ ముందుకు వచ్చి చందా కొచర్‌ సమాధానం చెప్పాల్సిందేనన్నారు. కొచర్‌ జాబ్‌ను బోర్డు నిర్వహించలేదన్నారు. అయితే ఐసీఐసీఐ బ్యాంక్‌ తన ఏజీఎంను ఆగస్టు 10నే చేపట్టాల్సి ఉంది. కానీ బ్యాంక్‌ సీఈవోపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో, స్వతంత్ర విచారణకు ఆదేశించేందుకు ఈ సమావేశాన్ని నెల పాటు వాయిదా వేసింది. త్వరలోనే కొచర్‌కు, ఆమె భర్త దీపక్‌ కొచర్‌కు సెబీ సమన్లు జారీ చేయనున్నట్లు తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కొంతమంది బ్యాంక్‌ టాప్‌ అధికారులు కూడా, కొచర్‌ భర్తతో భాగస్వామ్యమై లబ్ది పొందినట్టు తెలిసింది. వారిని వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. 
 

>
మరిన్ని వార్తలు