బ్యాంక్, సిమెంట్‌ షేర్ల జోరు

25 Jan, 2020 05:11 IST|Sakshi

227  పాయింట్ల లాభంతో 41,613కు సెన్సెక్స్‌

68 పాయింట్లు పెరిగి 12,248కు నిఫ్టీ

కంపెనీల క్యూ3 ఫలితాలు బాగా ఉండటం, బడ్జెట్‌పై ఆశావహ అంచనాలతో బ్యాంక్, సిమెంట్‌ షేర్లు పెరగడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. బలహీనంగా మొదలైనప్పటికీ, సెన్సెక్స్‌ 227 పాయింట్ల లాభంతో 41,613 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 12,248 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడ్డా, మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది. కరోనా వైరస్‌ చైనాలోనే తీవ్రంగా ఉందని, ఇతర దేశాల్లో ప్రభావం స్వల్పమేననని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లు రికవరీ కావడం సానుకూల ప్రభావం చూపించింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోయాయి. సెన్సెక్స్‌ 332 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల మేర పతనమయ్యాయి.

బడ్జెట్‌ మరో వారంలో రానుండటంతో బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 2 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 1.9 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.1 శాతం, ఎస్‌బీఐ 0.2 శాతం చొప్పున పెరిగాయి. చైనా, తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లకు సెలవు. హాంగ్‌కాంగ్, జపాన్‌ మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు 1 శాతం మేర పెరిగాయి.  ఈ క్యూ3లో నికర లాభం 80 శాతం మేర పెరగడంతో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్‌2.4 శాతం లాభంతో రూ.4,641 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.

మరిన్ని వార్తలు