కేంద్రం వార్నింగ్‌ : ఆ డేటా షేర్‌ చేస్తే ఇక అంతే

28 Oct, 2017 12:43 IST|Sakshi

న్యూఢిల్లీ : వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత డేటాను వాణిజ్య ప్రయోజనాల కోసం కంపెనీలకు షేర్‌ చేస్తే, తీవ్ర చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇది అన్యాయమైన వాణిజ్య  విధానమని, కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ లా కింద చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ-కామర్స్‌ కంపెనీలు వాణిజ్య ప్రయోజనాల కింద వ్యక్తిగత డేటాను కంపెనీలకు షేర్‌ చేస్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న క్రమంలో వినియోగదారుల సంరక్షణ బిల్లులో ప్రభుత్వం దీన్ని ప్రతిపాదించింది. ప్రజలు ఈ అన్యాపూర్వకమైన వాణిజ్య విధానాన్ని వినియోగదారుల కోర్టుల్లో ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ వీటిపై చర్యలు తీసుకునే హక్కులను కలిగి ఉంది. 

ఈ శీతాకాల సమావేశాల్లో  ఈ బిల్లు పాస్‌ అయ్యే అవకాశముందని వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వన్‌ తెలిపారు. సౌత్‌ ఈస్ట్‌ ఏసియా ప్రాంతంలో ప్రతి దేశం వినియోగదారులను కాపాడటానికి అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను షేర్‌ చేసుకుంటున్నాయన్నారు. ఇతర దేశాల నుంచి నేర్చుకున్న అంశాలతో తమ పాలసీ విధానాల్లో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. వినియోగదారుల ప్రైవసీని కాపాడాలంటూ అంతకముందు కూడా వినియోగదారుల హక్కుల కార్యకర్తలు, ఎన్‌సీడీఆర్‌సీ సభ్యులు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు