సత్యం దక్కకపోవడం దురదృష్టకరం

11 Jul, 2016 00:48 IST|Sakshi
సత్యం దక్కకపోవడం దురదృష్టకరం

* ఆరో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్
* నంబర్ 1 స్థానానికి చేరుకుంటాం: నాయక్

న్యూఢిల్లీ: ‘సత్యం’ కంప్యూటర్స్‌ను ఎల్‌ఎండ్‌టీ సొంతం చేసుకోకపోవడం దురదృష్టకరంగా గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏఎం నాయక్ అభిప్రాయపడ్డారు. 2009 జనవరి 7న సత్యం కంప్యూటర్స్ ఆర్థిక అవకతవకలు వెలుగు చూడడంతో ప్రభుత్వం కల్పించుకుని తర్వాత దాన్ని వేలం వేయడం, మహింద్రా గ్రూపు కొనుగోలు చేయడం తెలిసిందే. సత్యంలో అవకతవకల గురించి కంపెనీ అప్పటి చైర్మన్‌గా ఉన్న రామలింగరాజు స్వయంగా ప్రకటించడంతో షేరు ధర ఓ దశలో రూ.6.30కి పడిపోయింది.

దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన సత్యం కంప్యూటర్స్‌లో ఎల్‌అండ్‌టీఅప్పటికే  వాటాలు కలిగి ఉండీ దాన్ని దక్కించుకోకపోవడంపై నాయక్ తన అభిప్రాయాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
 
చివరిలో చేజారింది..: ‘సత్యం కంప్యూటర్స్‌ను సొంతం చేసుకునేందుకు మేము ముందు నుంచీ ప్రయత్నించాం. సత్యం కంప్యూటర్స్ షేర్ ధర పతనం మొదలైన తర్వాత రూ.210 దగ్గర, రూ.125 స్థాయిలో కూడా కొనుగోళ్లు జరిపాం. తర్వాత కూడా జరిపిన కొనుగోళ్లతో సగటున ఓ షేరు కొనుగోలు ధర రూ.80 రూపాయలుగా ఉంది. వేలంలో సత్యం కంప్యూటర్స్ షేరు ధర రూ.55-60 మధ్యలో ఉంటుందని భావించాం. అప్పటికే రూ.80 పెట్టి షేర్లు కొన్నందున... సగటు కొనుగోలు ధర తగ్గించుకునేందుకు రూ.47 కోట్ చేయాలని నిర్ణయించాం. అప్పుడు మొత్తం మీద సగటు ధర రూ.58 అవుతుంది. అయితే, మహీంద్రా సత్యం షేర్లను కొనుగోలు చేసి లేదు కనుక ఆలస్యంగా రంగంలోకి వచ్చినా షేర్‌కు 57-58 రూపాయలుగా బిడ్ వేసింది.

దాంతో సత్యం ఆ కంపెనీ పరమైంది. ఇది దురదృష్టకరం. అయితే, ఎల్ అండ్ టీ  ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీని సృష్టించింది. 90 కోట్ల డాలర్ల ఆదాయంతో, 20వేల మంది ఉద్యోగులతో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ దేశంలో ఆరో అతిపెద్ద ఐటీ కంపెనీ స్థాయికి చేరుకుంది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో ఆదాయాన్ని రెట్టింపు స్థాయి 200 కోట్ల డాలర్లకు తీసుకెళ్లడంతోపాటు ఐటీ టెక్నాలజీ రంగంలోనూ ఎల్‌అండ్‌టీని అగ్రపథంలో నిలబెట్టడమే మా అంతిమ లక్ష్యం’’ అని నాయక్ పేర్కొన్నారు.
 
ఎల్ అండ్ టీ బలమైన నాయకత్వం చేతిలోనే..
52 సంవత్సరాలుగా ఎల్‌అండ్‌టీ కంపెనీతో కలసి ప్రయాణిస్తూ 18 ఏళ్లుగా తన నాయకత్వంలో కంపెనీని అగ్రగామిగా నిలబెట్టిన ఏఎం నాయక్ (74)... వచ్చే ఏడాది తన బాధ్యతలను తన వారసుడు ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేతికి 2017 అక్టోబర్ 1న అప్పగించనున్నారు. ఈ పరిణామాలపై నాయక్ మాట్లాడుతూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
     
* ఎల్ అండ్ నా జీవితం. భార్య, పిల్లలకు మించి ఎల్‌అండ్‌టీకి ప్రాధాన్యం ఉంటుంది. నా తర్వాత కూడా కంపెనీ వర్ధిల్లాలని ఆకాంక్షిస్తాను.
* నా స్థానంలో వచ్చే వారికి పరిస్థితులు అంత సులువు కాదు. అయితే, ఎల్‌అండ్‌టీ భవిష్యత్తులోనూ బలమైన నాయకత్వం చేతిలోనే, దృఢంగానే ఉంటుంది.  
* సుబ్రహ్మణ్యన్ ప్రస్తుతం ఎల్‌అండ్‌టీ హోల్‌టైమ్ డైరక్టర్, డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్, ప్రెసిడెంట్ బాధ్యతలు చూస్తున్నారు.
* మొదట షిప్‌బిల్డింగ్ బాధ్యతలు, తర్వాత హైదరాబాద్ మెట్రో పర్యవేక్షణ బాధ్యతలు సుబ్రహ్మణ్యన్‌కు అప్పగించాను. ఆ తర్వాత క్రమంగా ఐటీ వ్యాపారంలోకి తీసుకొచ్చాను. ఏడాదిగా మరిన్ని బాధ్యతలు అప్పగించాను. ఓ మార్గదర్శకుడిగా నేను చేయాల్సింది చేశా.
* దేశంలో తయారీ, ప్రాజెక్టుల వ్యాపార రంగంలో ప్రతిభగల నాయకుల కొరత ఉంది. ఈ పరిస్థితి ఎల్‌అండ్‌టీ గ్రూపు వంటి వాటికి మరింత ఇబ్బందికరం. ఐఐటీ, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఉన్నవారు కూడా ఐటీ, టెక్నాలజీ, ఫైనాన్షియల్ రంగాల్లో పనిచేస్తున్నారు. దీంతో మేమే సాన పెట్టే కార్యక్రమాన్ని అంతర్గతంగా చేపట్టాం. దీంతో ఐఐటీ పట్టభద్రుల కంటే స్మార్ట్‌గా తయారవుతారు.
 
నేటి నుంచి ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ
లార్సెన్ అండ్ టుబ్రో అనుబంధ కంపెనీ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 13న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.1,243 కోట్ల నిధులు సమకూరుతాయని అంచనా. ఈ ఐపీఓకు ధర శ్రేణి రూ.705-710. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.10 డిస్కౌంట్ లభిస్తుంది. కనీసం 20 షేర్లకు బిడ్ చేయాలి.  ఈ ఐపీఓలో భాగంగా ఒక్కో షేర్‌ను రూ.710 ధరకు  యాంకర్ ఇన్వెస్టర్లకు విక్రయించడం ద్వారా కంపెనీ ఇప్పటికే రూ.373 కోట్లు సమీకరించింది.

మరిన్ని వార్తలు