ఆ కంపెనీల అకౌంట్లలో భారీగా డిపాజిట్లు

6 Oct, 2017 12:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అవినీతిపై ఉక్కుపాదం మోపడానికి కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్ల రద్దు అనంతరం పన్ను ఎగవేతదారులపై, షెల్‌ కంపెనీలపై ప్రభుత్వం కొరడా కూడా  ఝళిపిస్తోంది. తాజాగా పెద్ద నోట్ల రద్దు అనంతరం పలు షెల్‌ కంపెనీల్లో భారీ మొత్తంలో డిపాజిట్లు వెల్లువెత్తినట్టు ప్రభుత్వానికి బ్యాంకులు సమర్పించిన డేటాలో తెలిసింది. ప్రభుత్వం డేటా ప్రకారం 5,800 షెల్‌ కంపెనీలను ఈ ఏడాది మొదట్లో రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీల(ఆర్‌ఓసీ) నుంచి తొలగించారు. ఈ 5,800 కంపెనీలకు 13,140 అకౌంట్లు ఉన్నట్టు ప్రభుత్వ డేటాలో తెలిసింది. కొన్ని కంపెనీలకు వందకు పైగా అకౌంట్లు ఉన్నాయని, ఒక కంపెనీ అయితే ఏకంగా 2134 అకౌంట్లను కలిగి ఉన్నట్టు బ్యాంకు డేటా షీటు పేర్కొంది.

ఈ డేటా షీటు ప్రకారం ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించినప్పుడు, ఈ కంపెనీల్లో బ్యాలెన్స్‌ రూ.22.05 కోట్లు ఉన్నట్టు తెలిసింది. నవంబర్‌9 నుంచి అంటే పెద్దనోట్ల రద్దు తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ రద్దైన కంపెనీల్లో మొత్తం రూ.4,573.87 కోట్లు డిపాజిట్‌ అయ్యాయని, అంతే మొత్తంలో రూ.4,552 కోట్లు విత్‌డ్రా కూడా అయినట్టు వెల్లడైంది. పెద్ద నోట్ల రద్దు అప్పుడు నెగిటివ్‌ బ్యాలెన్స్‌ ఉన్న కొన్ని షెల్‌ కంపెనీల అకౌంట్లలో భారీ మొత్తంలో డిపాజిట్‌ అయి, భారీ మొత్తంలో విత్‌డ్రా అయినట్టు కూడా ప్రభుత్వం తెలిపింది. 

మరిన్ని వార్తలు