-

జేకుమార్, ప్రకాశ్‌ ఇండస్ట్రీస్‌కు శాట్‌ ఊరట

11 Aug, 2017 01:56 IST|Sakshi
జేకుమార్, ప్రకాశ్‌ ఇండస్ట్రీస్‌కు శాట్‌ ఊరట

ట్రేడింగ్‌ ఆంక్షలపై స్టే ఉత్తర్వులు
సెప్టెంబర్‌ 4కి విచారణ వాయిదా
నేటి నుంచి షేర్లలో యథాప్రకారం ట్రేడింగ్‌


ముంబై: అనుమానాస్పద షెల్‌ కంపెనీల అభియోగాలతో ట్రేడింగ్‌పరమైన ఆంక్షలు ఎదుర్కొంటున్న జేకుమార్, ప్రకాశ్‌ ఇండస్ట్రీస్‌కి కాస్త ఊరట లభించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలపై స్టే విధిస్తూ సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి విచారణ లేకుండానే సెబీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ సెప్టెంబర్‌ 4కి వాయిదా వేసింది. తాజా పరిణామంతో ఈ రెండు సంస్థల షేర్లలో శుక్రవారం నుంచి  మళ్లీ యథాప్రకారం ట్రేడింగ్‌ జరగనుంది. ఈ మేరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ కూడా సర్క్యులర్‌లు విడుదల చేశాయి.

రెండు సంస్థల షేర్లను నిఘా చర్యల (జీఎస్‌ఎం) పరిధి నుంచి తప్పించనున్నట్లు పేర్కొన్నాయి. 20 శాతం  శ్రేణిలో వీటిలో ట్రేడింగ్‌కు అనుమతించనున్నట్లు వివరించాయి. ’అనుమానాస్పద డొల్ల కంపెనీలు’ ఆభియోగాలతో 331 సంస్థల షేర్లలో ట్రేడింగ్‌పై సెబీ ఆగస్టు 7న ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలోని కొన్ని కంపెనీల్లో దేశ విదేశాలకు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా ఉన్నాయి. సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ జేకుమార్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్, ప్రకాశ్‌ ఇండస్ట్రీస్‌ తమను ఆశ్రయించడంతో శాట్‌ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. అటు స్టాక్‌ ఎక్సే్చంజీలు సైతం తమ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని సూచించింది.

విచారణ లేకుండానే ఆంక్షలు..
‘పిటీషనర్లు వాదిస్తున్నట్లుగా.. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) 2017 జూన్‌ 9న పంపిన లేఖలో అనుమానాస్పదమైనవిగా భావిస్తున్న 331 కంపెనీలు నిజంగానే డొల్ల కంపెనీలేనా లేక నిఖార్సయినవేనా అన్నది మాత్రమే సెబీ విచారణ జరపాల్సి ఉంది. కానీ ఎలాంటి విచారణ జరపకుండానే సెబీ ఆంక్షల ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది‘ అని ట్రిబ్యునల్‌ వ్యాఖ్యానించింది. పైగా ఎంసీఏ సూచనలను అమలు చేయడానికి సెబీ దాదాపు రెండు నెలల సమయం తీసుకోవడాన్ని బట్టి చూస్తే.. విచారణ లేకుండానే అత్యవసరంగా ఆదేశాలివ్వాల్సినంత పరిస్థితి కూడా లేదని స్పష్టంగా తెలుస్తోందని శాట్‌ పేర్కొంది.

సదరు కంపెనీల వివరణ కూడా తీసుకున్న సెబీ హోల్‌టైమ్‌ మెంబరు.. మరింత సమాచారం కావాలని కోరినట్లు తమ దృష్టికి వచ్చినట్లు శాట్‌ పేర్కొంది. అయితే, ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో పిటీషనర్ల ప్రయోజనాలకు భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో ఊరటనిచ్చేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు వివరించింది.

మరిన్ని వార్తలు