ఫండ్స్ కొనుగోళ్లకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలా?

14 Apr, 2014 01:07 IST|Sakshi

నేను గత కొంతకాలంగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన లాక్-ఇన్ పీరియడ్ పూర్తయింది. నేను ఈ స్కీమ్‌లోనే కొనసాగాలనుకుంటున్నాను. కానీ, డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఆదా చేసే ఉద్దేశంతో డివిడెండ్ ఆప్షన్  నుంచి గ్రోత్ ఆప్షన్‌కు మారదామనుకుంటున్నాను. ఇలా మారితే మరో మూడేళ్లు లాకిన్ పీరియడ్ వర్తిస్తుందా?- లావణ్య కుమార్, హైదరాబాద్

 మీరు ఈఎల్‌ఎస్‌ఎస్ స్కీమ్‌లో కొనసాగాలనుకుంటే, డివిడెండ్ ఆప్షన్ నుంచి గ్రోత్ ఆప్షన్‌కు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను మార్చుకుంటే, దానిని తాజా కేసుగానే భావిస్తారు. దీంతో మరో మూడేళ్ల లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో గ్రోత్ ఆప్షన్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈ లాకిన్ పీరియడ్ బాదరబందీ ఏమీ ఉండదు. ఈఎల్‌ఎస్‌ఎస్ డివిడెండ్ ఆప్షన్‌లో ఎప్పుడు డివిడెండ్ చెల్లించాలనేది ఫండ్ మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తుంది. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో రెగ్యులర్ ఆప్షన్‌లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై  నియంత్రణ మీకే ఉంటుంది. ఒక ఏడాది దాటిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీరు ఉపసంహరించుకుంటే, వాటిని దీర్ఘకాలిక లాభాలుగా పరిగణించి ఎలాంటి పన్నులు విధించరు. ఫలితంగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీరు ఎప్పుడు ఉపసంహరించుకోవాలనే విషయాన్నీ మీరే నిర్ణయించుకోవచ్చు. అంతేకాకుండా ఎంత కావాలనుకుంటే అంతే మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.

 సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? లేదా ఒక్కసారే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా?            - మాళవిక, గుంటూరు
 ఒక్కసారే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కంటే, సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమమైనదని పలువురు నిపుణులు చెబుతుంటారు.  దీర్ఘకాలానికి పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం కన్నా, సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమమని  చాలా చాలా సందర్భాల్లో, ఎన్నోసార్లు నిరూపితమైనది. ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో నిర్ణీత కాలానికి నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం(ఉదాహరణకు నెలకు రూ.10,000 చొప్పున ఒక పదేళ్లపాటు)గా సిప్ విధానాన్ని పేర్కొనవచ్చు. ఫండ్ ఎన్‌ఏవీ(నెట్ అసెట్ వాల్యూ) ఎంత ఉన్నదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా క్రమం తప్పకుండా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తారు.

 ఫలితంగా మార్కెట్లు పడిపోతున్నప్పుడు మనకు ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. దీంతో సగటు ధర తక్కువగా ఉండి, అధిక రాబడులు వస్తాయి. అలా కాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఈక్విటీ మార్కెట్లు ఉచ్ఛదశలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు అధిక ఎన్‌ఏవీకి యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాతి కాలంలో మార్కెట్లు పడిపోతే, మీ లాభాలు కూడా తగ్గిపోతాయి. ఒక వేళ మార్కెట్లు బాగా పడిపోయినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే, సిప్ కంటే మంచి రాబడులే వస్తాయి.

 కానీ, దీనిని పట్టుకోవడం కష్టం. మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఇంకా పడిపోతాయేమో అన్న సందేహం ఉంటుంది. మనం ఊహిం చని విధంగా మళ్లీ మార్కెట్లు పుంజు కుం టాయి. ఏడాది అంతకు మించిన దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సిప్ విధానమే ఉత్తమం. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు సాధారణ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అదే మార్కెట్లు పతన దశలో ఉన్నప్పుడు అసలు మార్కెట్ల జోలికే వెళ్లరు. కానీ సిప్ విధానంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది.

 మ్యూచువల్ ఫండ్స్‌ను డీమ్యాట్ అకౌంట్ ద్వారానే కొనుగోలు చేయాలా?  - శశి, విజయవాడ
 డీ మ్యాట్ అకౌంట్ ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే డీమ్యాట్ అకౌంట్ లేకుండా కూడా ఫండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచే నేరుగా మీరు మ్యూచువల్ ఫండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. సంబంధిత దరఖాస్తును నింపి, నిర్ణీత మొత్తానికి చెక్కును సదరు మ్యూచువల్ ఫండ్ కంపెనీకి పంపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్ వెబ్‌సైట్ నుంచి కూడా ఆన్‌లైన్‌లో ఫండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని వార్తలు