గవర్నర్‌ తన ధర్మాన్ని పాటించాలి

25 Dec, 2018 00:48 IST|Sakshi

ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడాలి: సి.రంగరాజన్‌

ముంబై: ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడే విషయంలో నూతన గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తన ధర్మాన్ని అనుసరించాలని మాజీ గవర్నర్‌ సి.రంగరాజన్‌ సూచించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమితులైన తొలి ప్రభుత్వ అధికారి శక్తికాంతదాస్‌ కాదని చెప్పారాయన. ‘‘చాలా మంది ఢిల్లీ అధికారులు ఆర్‌బీఐలోకి వచ్చారు. ఇదే తొలిసారి కాదు. ఒక్కసారి వారు బాధ్యతలు చేపట్టాక ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని కాపాడేందుకే కృషి చేశారు’’ అని రంగరాజన్‌ వ్యాఖ్యానించారు. ఇది ధర్మం వంటిదని, తనతోపాటు మాజీ గవర్నర్లంతా ఇదే అనుసరించారని చెప్పారు.

ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు. శక్తికాంతదాస్‌ ఆర్‌బీఐ స్వతంత్రను పణంగా పెట్టకుండా, రెండింటి మధ్య వ్యవహారాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, పనిచేయగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జీడీపీ గణన విషయంలో ఇటీవల చేసిన మార్పుల గురించి కొన్ని కనీస వివరాలను కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌వో) వెల్లడించాల్సిన అవసరం ఉందని రంగరాజన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘సీఎస్‌వో ఎంతో పేరున్న సంస్థ. గత గణాంకాలను సవరించే విషయంలో అనుసరించిన విధానాన్ని మరింత స్పష్టం చేయాలి’’ అని కోరారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుమఖం పడితే, ఆర్‌బీఐ ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.    

మరిన్ని వార్తలు