అందరిచూపు ‘గేటెడ్’ వైపే!

1 Jan, 2016 23:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: 2016 సంవత్సరం.. భాగ్యనగర స్థిరాస్తి మార్కెట్ సానుకూలంగా ఉండనుంది. మరీ ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో అమ్మకాలు ఊపందుకుంటాయి. నిర్మాణ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలు, నూతన పారిశ్రామిక విధానంతో నగరానికొస్తున్న పెట్టుబడులు, కొత్త సంస్థలతో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఫ్లాట్లు కొనేవారి సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
 
 నగరవాసులకు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులపై ఆసక్తి పెరిగింది. అభద్రతాభావం.. ఇతరత్రా కారణాల వల్ల వీటివైపు మొగ్గుచూపుతున్నారు. సింగిల్ అపార్ట్‌మెంట్ల బదులు.. కమ్యూనిటీలో నివసించాలని చాలా మంది భావిస్తున్నారు. నగరంలో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు పునరావృతమైతే.. ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో.. కొందరు గేటెడ్ కమ్యూనిటీలవైపు దృష్టి సారిస్తున్నారు. బూమ్ సమయంలో ఆరంభమైన బడా ప్రాజెక్టుల్లో ప్రస్తుతం కొన్ని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని చివరి దశకు చేరుకున్నాయి. వీటిలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించని ప్రాజెక్టుల వైపు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.
 
 నగరంలో పలు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల వద్ద సందర్శకులు సందడి మొదలైంది. ఇక ఆలస్యం చేయడం వృథా అనుకున్నవారు ఫ్లాట్ల కొనుగోళ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రాజెక్ట్‌ను చూసిన రెండు వారాల్లోగా తుది నిర్ణయానికి వస్తున్నారు. నిన్నటి వరకూ విల్లాల జోలికి వెళ్లనివారు నేడు ఆసక్తి చూపిస్తున్నారని ఓ బిల్డర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో సానుకూల ధోరణి పెరగడంతో ప్రాజెక్టు సందర్శనలు ఆధికమయ్యాయని తెలిపారు. గత నాలుగు నెలల్లో నిజాంపేట ఏరియాలో అత్యధికంగా మా విల్లాలే అమ్ముడుపోయాయి.
 

మరిన్ని వార్తలు