కాల్‌ డ్రాప్స్‌పై టెల్కోలకు షోకాజ్‌ నోటీసులు

14 Mar, 2018 00:53 IST|Sakshi

వారాంతంలోగా వివరణనివ్వాలని ట్రాయ్‌ ఆదేశాలు

న్యూఢిల్లీ: కాల్‌ డ్రాప్స్‌ సమస్య పరిష్కారానికి సంబంధించి కొత్త నాణ్యతా ప్రమాణాలను అమలు చేయడంలో విఫలమైనందుకు గాను కొన్ని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ వారాంతంలోగా వివరణనివ్వాలని ఆదేశించింది. ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ ఈ విషయాలు వెల్లడించారు. అయితే, ఏయే కంపెనీలకు నోటీసులు ఇచ్చినదీ వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

గతేడాది అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో కొన్ని నిర్దిష్ట సర్కిల్స్‌లో సర్వీసుల నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ఈ నోటీసులు ఇచ్చినట్లు శర్మ చెప్పారు. ఆయా ఆపరేటర్ల వివరణను బట్టి చర్యలు ఉంటాయని ఆయన వివరించారు. కాల్‌ డ్రాప్స్‌ నివారించేందుకు ఉద్దేశించిన కఠిన నిబంధనలు 2017 అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం టెలికం సర్కిల్‌ స్థాయిలో కాకుండా కాల్‌ డ్రాప్స్‌ సమస్యను మొబైల్‌ టవర్‌ స్థాయిలో పరిశీలిస్తారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిన పక్షంలో ఆపరేటర్లకు గరిష్టంగా రూ. 10 లక్షల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు