కాఫీ కింగ్‌ ట్రాజెడీ : సిద్ధార్థలు ఇంకా ఎందరు..?

1 Aug, 2019 12:14 IST|Sakshi

బెంగళూర్‌ : కాఫీ కింగ్‌ వీజీ సిద్ధార్థ విషాదాంతం కార్పొరేట్‌ భారతం ఎదుర్కొంటున్న సంక్షోభం, లిక్విడిటీ క్షీణతలను ప్రతిబింబిస్తోంది. సిద్ధార్ధ బలవన్మరణానికి పాల్పడే ముందు కంపెనీ బోర్డు సభ్యులు, ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు భారత పారిశ్రామికవర్గాల్లో భారీ కుదుపునే రేపాయి. రుణదాతలు, ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి ఎదురైన ఒత్తిళ్లు అప్పుల ఊబిలో మూసుకుపోయిన దారులు సిద్ధార్థను ఉక్కిరిబిక్కిరి చేసిన తీరు కార్పొరేట్‌ భారతానికి పెను ప్రమాద సంకేతాలు పంపాయి.

రెండున్నర దశాబ్ధాల సుదీర్ఘ వ్యాపార పయనంలో కేఫ్‌ కాఫీ డే(సీసీడే)ను ఆయన శాఖోపశాఖలుగా విస్తరించిన తీరు, కాఫీ తోటల నుంచి కస్టమర్‌కు పొగలు కక్కే కాఫీని కాఫీ టేబుల్‌పైకి అందించే వరకూ అన్ని దశల్లో ఆయన ఒడుపు అనితరసాధ్యమే. తేనీరును ఆస్వాదించే భారత్‌లో ఏకంగా 1700 స్టోర్‌లు, 54,000 వెండింగ్‌ మెషీన్లతో ఒంటి చేత్తో కాఫీని దశదిశలా చేర్చిన సిద్ధార్థ రుణభారంతో తనువు చాలించడం విషాదకరం.

అప్పులు గుదిబండగా మారడంతో పాటు కంపెనీలో తనఖాలో ఉన్న తన షేర్లను రుణదాతలు తమకు మళ్లించాలని కోరడం, మరోవైపు హామీలున్నా అత్యధికంగా 14 శాతం వడ్డీతో కొత్త రుణాలను సమీకరించాల్సి రావడం‍ రుణభారాన్ని ఇబ్బడిముబ్బడి చేసింది. ఇదే సమయంలో ఓ ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్‌ షేర్లను బైబ్యాక్‌ చేయాలని ఒత్తిడి చేయడం, మైండ్‌ట్రీ విక్రయం ద్వారా సమకూరిన నిధులపై తమకు రావాల్సిన మొత్తం కోసం ఆదాయ పన్ను అధికారుల నుంచి ఒత్తిళ్లతో సిద్ధార్థ తీవ్ర నిర్ణయం దిశగా కదిలారు. తన ముందున్న సంక్లిష్ట పరిస్ధితుల్లో తనువు చాలించడం మినహా మరోమార్గం లేదనే రీతిలో తను రాసిన లేఖలో సిద్ధార్ధ స్వయంగా వెల్లడించారు.

‘వీజీ సిద్ధార్ధ ఒక్కరే కాదు దేశంలో ఇలాంటి వారు మరో 100 మంది ఇతర పారిశ్రామికవేత్తలూ ఉన్నారు. కంపెనీల వద్ద ద్రవ్య లభ్యత లేకపోవడం, రీఫైనాన్సింగ్‌ లభించకపోవడంతో వారు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నార’ని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ కేర్‌ రేటింగ్స్‌కు చెందిన చీఫ్‌ ఎకనమిస్ట్‌ మదన్‌ సబ్నవిస్‌ చెప్పడం కార్పొరేట్‌ భారతంలో సంక్లిష్టతలకు అద్దం పడుతోంది.

మరిన్ని వార్తలు