నీరవ్‌ మోదీకి సింగపూర్‌ హైకోర్టు షాక్‌..!

3 Jul, 2019 05:09 IST|Sakshi

కుంటుంబ సభ్యుల ఖాతాల స్తంభనకు ఆదేశం

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ని మోసగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త నీరవ్‌ మోదీ కుటుంబసభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలంటూ సింగపూర్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం నీరవ్‌ మోదీ సోదరి పుర్వి మోదీ, బావ మయాంక్‌ మెహతాల ఖాతాలను అక్కడి బ్యాంకులు స్తంభింపచేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వెల్లడించింది. ఈ అకౌంట్స్‌లో సుమారు 6.122 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 44.41 కోట్లు) ఉన్నట్లు పేర్కొంది.

బ్యాంకులను మోసం చేయడం ద్వారా వచ్చిన సొత్తులో ఇది కూడా భాగమేనని, దీన్ని నిందితులు విత్‌డ్రా చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడంతో న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే నీరవ్‌ మోదీకి స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న నాలుగు ఖాతాలను అక్కడి బ్యాంకులు స్తంభింపచేశాయి. వీటిలో దాదాపు రూ. 283 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. పీఎన్‌బీని నీరవ్‌ మోదీ దాదాపు రూ. 14,000 కోట్ల మేర మోసం చేసి, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును ఈడీ, సీబీఐ తదితర ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. 

మరిన్ని వార్తలు