నాన్‌ స్టాప్‌ విమానాలు వచ్చేస్తున్నాయ్‌

27 Apr, 2018 13:14 IST|Sakshi

సింగపూర్‌ : నాన్‌-స్టాప్‌ బస్సులు, రైళ్లే కాదు ఇక మీదట నాన్‌-స్టాప్‌ విమానాలు రానున్నాయి. అవును ప్రపంచంలోనే తొలి నాన్‌-స్టాప్‌ విమానాన్ని ప్రారంభించనున్నట్లు సింగపూర్‌ విమానయాన సంస్థ అధికారులు ప్రకటించారు. ఈ విమానం ఏకధాటిగా 20 గంటల పాటు గాలిలోనే ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. సింగపూర్‌ విమానయాన సంస్థ నూతనంగా ప్రారంభించబోయే ‘ఎయిర్‌బస్‌ ఏ350 - 900 యూఎల్‌ఆర్‌’(అల్ట్రా లాంగ్‌ రేంజ్‌) విమానం ఈ ఘనతను సాధించబోతుందని పేర్కొన్నారు. ఈ విమానం సింగపూర్‌ నుంచి న్యూయార్క్‌ వరకూ 20 గంటల పాటు ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తుందని గురువారం నాడు అధికారులు ప్రకటించారు.

గతంలో 9 వేల మైళ్ల దూరాన ఉన్న న్యూయార్క్‌ వెళ్లడానికి ఈ విమానయాన సంస్థ గ్యాస్‌తో నడిచే నాలుగు ఇంజిన్లు గల ‘ఏ340 - 500’ విమానాలను ఉపయోగించేది. అయితే ఈ విమానంలో కేవలం వంద బిజినెస్‌ క్లాస్‌ సీట్లు మాత్రమే ఉండేవి. అంతేకాక వీటి సేవలు కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో సింగపూర్‌ విమానయాన సంస్థ వీటిని 2013లో రద్దు చేసింది. ఈ ‘ఎయిర్‌బస్‌ ఏ340 - 500’ స్థానంలో ఎక్కువ విస్తీర్ణం ఉన్న ‘ఎయిర్‌బస్‌ ఏ350 - 900’లను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇలాంటివి మొత్తం ఏడు అల్ట్రా లాంగ్‌ రెంజ్‌ విమానాల కొనుగోలుకు ఆదేశించినట్లు అధి​కారులు తెలిపారు. ఈ ఏ350 - 900 విమానాన్ని ఈ నెల 23న దాదాపు ఐదు గంటల పాటు పరీక్షించిన అనంతరం ఫ్రాన్స్‌లోని టౌలాస్‌ విమానాశ్రయంలో లాండ్‌ చేశారు.

వాస్తవానికి అల్ట్రా లాంగ్‌ రేంజ్‌ విమానాలు ఏకధాటిగా దాదాపు 11,160 మైళ్లే ప్రయాణిస్తాయని, కానీ ప్రస్తుతం రూపొందించిన ఏ350లో ఈ సామర్థ్యాన్ని మరో 1800 మైళ్లను పెంచనున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత దూరం ఏకధాటిగా ప్రయాణించే విమానయాన సంస్థగా సింగపూర్‌ రికార్డు సృష్టించనుంది. ‘ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం రూపొందించబోయే ఏ350 విమానాల్లో అనేక మార్పులు చేయనున్నాం. పాత విమనాల్లో క్యాబిన్‌ పొడవైన గొట్టం మాదిరిగా ఉండేది. కానీ ప్రస్తుతం తీసుకురానున్న ఏ350 ఎయిర్‌బస్‌లలో క్యాబిన్‌ పూర్తిగా మార్చివేసి ఒక గదిలాగా డిజైన్‌ చేయనున్నాం. అంతేకాక విమానం లోపల అధునాతన ఎల్‌ఈడీ లైటింగ్‌ వ్యవస్థతో పాటు తక్కువ శబ్దం వచ్చేలా మార్పులు చేయనున్నాం’ అని ఎయిర్‌బస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంటీరియర్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఫ్లారెంట్‌ పెటేని తెలిపారు.

మరిన్ని వార్తలు