జీవీకేలో చాంగీ ఎయిర్ పోర్ట్ కు వాటా?

9 Feb, 2016 01:30 IST|Sakshi
జీవీకేలో చాంగీ ఎయిర్ పోర్ట్ కు వాటా?

ఎయిర్‌పోర్ట్ వ్యాపారంలో 49శాతం వాటా కొనుగోలు!
ఇంకా చర్చల దశలోనేఉందంటున్న జీవీకే యాజమాన్యం
వాటా విక్రయం ద్వారా తగ్గనున్న రూ.3,600 కోట్ల రుణ భారం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్ట్ వ్యాపారాన్ని ప్రత్యేక సంస్థగా విడదీసి స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్న ఆలోచనలకు జీవీకే ఇన్‌ఫ్రా పక్కకు పెట్టినట్లు తాజా సమాచారం.  మార్కెట్ పరిస్థితులు అనువుగా లేకపోవడంతో ఐపీవో కంటే ప్రైవేటుగా వాటాలను విక్రయించడం ద్వారానే నిధులు సేకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పలు అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సింగపూర్‌కు చెందిన చాంగీ ఎయిర్‌పోర్ట్ గ్రూపు జీవీకేకు చెందిన మొత్తం ఎయిర్‌పోర్ట్ వ్యాపారంలో 49శాతం వాటాను కొనేందుకు ముందుకొచ్చినట్లు మార్కెట్లో వార్తలు షికార్లు చేశాయి.

ప్రస్తుతం జీవీకే గ్రూపు మొత్తం రెండు దేశీయ, ఒక విదేశీ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. జీవీకే ముంబై ఎయిర్‌పోర్టులో 50.5% వాటా, బెంగళూరు ఎయిర్‌పోర్టులో 43శాతం వాటా, ఇండోనేసియాకు చెందిన బాలీ ఎయిర్‌పోర్టులో 100శాతం వాటాను కలిగి ఉంది. జీవీకే ఎయిర్‌పోర్ట్ వ్యాపార విలువను సుమారుగా రూ. 8,800 కోట్లుగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు విభాగానికి రూ. 3,600 కోట్ల అప్పులున్నాయి. చాంగీ ఎయిర్‌పోర్ట్‌కు వాటాను విక్రయించడం ద్వారా మొత్తం రుణ భారాన్ని వదిలించుకోవాలన్నది జీవీకే ఇన్‌ఫ్రా ఆలోచన. కానీ చాంగీ ఎయిర్‌పోర్టు 49శాతం వాటాకి రూ. 3,000-3,500 కోట్లు మాత్రమే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

 చర్చల మాట నిజమే..:
వాటా విక్రయానికి సంబంధించి వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్న మాట వాస్తవమేని, కానీ ఇవి ఇంకా తుది దశకు చేరుకోలేదని జీవీకే ఇన్‌ఫ్రా స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియచేసింది. మార్కెట్లో నడుస్తున్న పుకార్లపై ఎక్స్ఛేంజీలు వివరణ కోరాయి. దీనిపై స్పందిస్తూ  నిధుల సమీకరణ కోసం ఒకరిద్దరు ఇన్వెస్టర్లతోపాటు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ వివరించింది. ఫిబ్రవరి 12న మూడో త్రైమాసిక ఫలితాలు ఉండటంతో ప్రస్తుతం ‘సెలైంట్ పిరియడ్ (ఈ సమయంలో ఎటువంటి నిర్ణయాలు, ప్రకటనలు ఉండవు)’లో ఉన్నట్లు తెలిపింది. వాటాలు విక్రయించడానికి బిడ్డింగులు పిలవగా 5 అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయని, వీటిలో ‘చాంగీ’తో చర్చలు తుది దశలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో 6 నెలల్లో  ఈ వాటా విక్రయం పూర్తవుతుందని భావిస్తున్నారు.

 లాభాల్లో ఎయిర్‌పోర్ట్ వ్యాపారం
భారీ అప్పుల్లో కూరుకుపోయిన జీవీకే ఇన్‌ఫ్రాకు సంబంధించి, ఎయిర్‌పోర్ట్ వ్యాపారం ఒక్కటే లాభాల్లో కొనసాగుతోంది. తగ్గిన ఇంధన ధరలతో విమాన ప్రయాణికుల సంఖ్య పెరగడం, కొత్త విమానయాన సంస్థలు ప్రవేశించడంతో ఆదాయంలో గణణీయమైన వృద్ధి నమోదవుతోంది. ద్వితీయ త్రైమాసికంలో ఎయిర్‌పోర్ట్ విభాగం రూ. 674 కోట్ల ఆదాయంపై రూ. 94 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

>
మరిన్ని వార్తలు