సింగ్‌ సోదరుల రాజీనామాలు ఆమోదం

14 Feb, 2018 02:34 IST|Sakshi

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ వెల్లడి 

న్యూఢిల్లీ:  ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ ప్రమోటర్లు–మల్వీందర్‌ సింగ్, శివిందర్‌ సింగ్‌ల రాజీనామాలను ఆమోదించామని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ తెలిపింది. సింగ్‌ సోదరులు ప్రమోటర్లుగా ఉన్న ఆర్‌హెచ్‌టీ హెల్త్‌ ట్రస్ట్‌ (ఆర్‌హెచ్‌టీ)ను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని, సింగపూర్‌లో లిస్టైన ఈ కంపెనీని రూ..4,650 కోట్లకు కొనుగోలు చేయనున్నామని, ఈక్విటీ, రుణాల ద్వారా ఈ మొత్తాన్ని సమీకరిస్తామని కూడా తెలిపింది.

ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మల్వీందర్, నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌గా ఉన్న శివిందర్‌ సింగ్‌ రాజీనామాలను మంగళవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించిందని పేర్కొంది. కంపెనీ కార్యకలాపాల నిర్వహణ గాను ఒక మేనేజ్‌మెంట్‌ కమిటీని ఏర్పాటు చేశామని వివరించింది. క్యూ2, క్యూ3 ఆర్థిక ఫలితాలను ఈ నెల 28న వెల్లడిస్తామని, దీని కోసం ఆ రోజు డైరెక్టర్ల సమావేశం జరుగతుందని పేర్కొంది.  

రూ.66 కోట్ల జరిమానా చెల్లించాం...: బోర్డ్‌ మీటింగ్‌ జరిగే సమయానికల్లా ఆడిటర్లు ఆడిటింగ్‌ను పూర్తి చేయకపోవడంతో అదనంగా 15 రోజుల గడువును కోరుతున్నామని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ వివరించింది. షెడ్యూల్‌ ప్రకారమైతే, మంగళవారం జరిగిన బోర్డ్‌  మీటింగ్‌లోనే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2, క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించాల్సి ఉంది.

బోర్డ్‌ ఆమోదం లేకుండా సింగ్‌ సోదరులు కంపెనీ నుంచి  రూ.500 కోట్లు తీసుకున్నారని, దీనికి లెక్కలు లేకపోవడంతో ఆడిటింగ్‌ వ్యవహారాలు చూస్తున్న డెలాయిట్‌ హాస్కిన్స్‌ అండ్‌సెల్స్‌ ఎల్‌ఎల్‌పీ క్యూ2 ఫలితాలను వెల్లడించడానికి నిరాకరించిందని గత వారం బ్లూమ్‌బర్గ్‌ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. క్యూ2 ఫలితాలు వెల్లడించడంలో జాప్యం జరిగినందుకు స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు రూ.66 కోట్ల మేర జరిమానా చెల్లించామని వివరించింది.

మరిన్ని వార్తలు